News

పాఠ్యాంశంగా పాడేరు మోదకొండమ్మ జాతర

552views

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లికి అరుదైన గౌరవం దక్కింది. మన్యం దేవతగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశేష ప్రాచుర్యం పొందిన ‘పాడేరు మోదకొండమ్మ’కు పదో తరగతి తెలుగు వాచకంలో చోటు దక్కింది. ఈ విద్యా సంవత్సరంలో ముద్రించిన పదో తరగతి తెలుగు వాచకంలో ‘ప్రత్యక్ష దైవాలు’ పేరిట రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు పండగలు, సంప్రదాయాలను పాఠ్యాంశాల్లో చేర్చారు. అందులో భాగంగా తెలుగు వాచకం 14వ పేజీలో ‘మోదకొండమ్మ జాతర’ శీర్షికతో పాడేరులో ప్రతి ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో మూడు రోజులు నిర్వహించే జాతర గురించి వివరించారు. దీనిని రాష్ట్ర స్థాయి గిరిజన జాతరగా గుర్తించిన వైనాన్ని ప్రస్తావించారు. పాడేరుకు చెందిన మోదకొండమ్మ జాతర అంశాన్ని పదో తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చడంపై మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.