ArticlesNews

శ్రీకృష్ణుడు రాజకీయవాది కాడు!?

62views

శ్రీకృష్ణుడు గొప్ప రాజకీయవేత్త అనే మాట ప్రసిద్ధమైనమాటే! ఆయనకు రాజకీయవేత్త, లేక రాజకీయవాది అనే విశేషణం ఎంత వరకు సమంజసమో అలోచించాల్సిన విషయమే. అసలు రాజకీయవాది అంటే ఎవరో కూడా మనం నిర్వచించుకోవలసిన అగత్యం ఉన్నది. రాజకీయ సమస్యలను గురించి మాట్లాడినంత మాత్రాన లేదా రాజ్యక్షేమానికి సంబంధించిన అంశాలలో జోక్యం చేసుకొన్నంత మాత్రాన ఒక వ్యక్తి ‘రాజకీయవాది’ అనిపించుకుంటాడు అని అంటే శ్రీకృష్ణుడిని కూడా రాజకీయవాది అని అనక తప్పదు. అలాంటి పనులు శ్రీకృష్ణుడు తన జీవితంలో చాలా చేశాడు.

తననూ, అన్న బలరాముడిని మట్టుపెట్టాలని కంసుడు శకటాసుర, పూతనాది రాక్షసులను ఎందరినో పంపించాడు. కృష్ణుడు వారిని చంపాడు. ఇక కుదరక కంసుడు బలరామకృష్ణులను సభకే ఆహ్వానించాడు. కృష్ణుడు కంసుడిని చంపి కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టాడు. ఇది ప్రత్యక్షంగా రాజకీయమే. రాజ్యానికి సంబంధించినదే. తరువాత కాలంలో శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన చేరాడు. యుద్ధంలో అర్జునుని రథం మీద కూర్చుని చక్రం తిప్పాడు. ఇదీ రాజకీయమే! యుద్ధానంతరం ధర్మరాజును స్వహస్తాలతో అభిషిక్తుడిని చేశాడు. ఇదంతా రాజకీయ కార్యకలాపం క్రిందకే వస్తుంది. కనుక కృష్ణుడు రాజకీయవాది. పొలిటిషియన్. ఇలా చెబితే నిజానికి కాదనటం కష్టమే.

కాని రాజకీయవాది అనే మాటకు ఇదే అర్థం అంటే రాజకీయవాది కాని వ్యక్తి మనకు కనిపించడు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో. రాజకీయ సమస్యలను రాజ్య క్షేమానికి సంబంధించిన విషయాలలో ప్రతివ్యక్తి జోక్యం చేసుకొంటూనే ఉంటాడు. జోక్యం చేసుకొనాలని మనం అభిలషిస్తాము కూడా. అటువంటప్పుడు ఒక్క కృష్ణుడు ఏమిటి? కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న 18 అక్షౌహిణుల సైన్యంలో ప్రతివ్యక్తి రాజకీయవాది అవుతాడు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రతి పౌరుడూ రాజకీయవాదే అవుతాడు.