ArticlesNews

ఆర్ఎస్ఎస్ – మహిళాశక్తి

1.2kviews

వందనీయ లక్ష్మీబాయి సేవికాసమితిని స్థాపించడానికి ముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలి సర్ సంఘచాలక్ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ ను కలుసుకున్నారు. సంఘానికి ఒక మహిళా విభాగం ఏర్పాటు అవసరం గురించి చర్చించుకున్నారు. ఒకే సిద్ధాంతం కలిగి ఉన్నప్పటికీ సేవికాసమితి స్వతంత్ర ప్రతిపత్తితో మహిళలకే పరిమితం కావాలని డాక్టర్ సూచించారు. మహిళా సంస్థ స్వతంత్ర ప్రతిపత్తితో పని చేయాలని ఆశించారు.మహిళా సంస్థకు మహిళే నాయకత్వం వహించాలన్న ఆయన ఊహ, మహిళా సంస్థను మహిళలే నడిపించాలన్న ఆయన దృష్టి స్మరణీయమైనవి.

వార్ధాలో ఆరంభమైన సేవికా సమితి సిద్ధాంతం, ఆచరణ అంతా హిందూ ధర్మ సూత్ర జనితమే. భారతీయ చరిత్ర క్రమం నుంచి తీసుకున్నదే. శివాజీ మాతృమూర్తి జిజాబాయి వారికి ఆదర్శం. శాఖ అనే ప్రక్రియ ద్వారానే హిందూ ధర్మానికి గత వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యం.మహిళ సృష్టికే ఆదిశక్తి అని నమ్ముతుంది హిందూధర్మం. ఆ సమున్నత శక్తినే మనం మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి రూపంలో దర్శిస్తాం. భారతీయవ్యవస్థ బ్రహ్మచైతన్య శక్తిలో అంతర్భాగం. ఈ శక్తి కూడా స్త్రీ ఉనికి చుట్టూ అల్లుకున్నదే. అలాంటి శక్తిని చైతన్యపరచి, జాతినిర్మాణంలో ఉపయోగించాలన్నదే వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ ఆశయం.

వందనీయ లక్ష్మీబాయిని ఆద్య ప్రముఖ సంచాలికగా మన్నిస్తారు. స్త్రీశక్తి సంఘటిత కావాలన్న ఆమె మంత్రం భారతదేశంలోనే కాదు, చాలా దేశాలలో కూడా తనదైన ప్రభావం చూపుతున్నది. ఎక్కడైనా సమితికి చోదక శక్తిగా ఉండేది హిందూత్వ విలువలే. మాననీయ శాంతక్కాజీ (వెంకటరామయ్య శాంతకుమారి) ప్రస్తుతం సేవికాసమితి ప్రముఖ సంచాలికగా వ్యవహరిస్తున్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పనిచేస్తూ సేవికాసమితి దేశమంతటా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.