ArticlesNews

రాధా గోవిందస్వామికి.. పూర్వ వైభవం వచ్చేనా?

83views

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో 184ఏళ్ల చరిత్ర కలిగిన మెళియాపుట్టి రాధాగోవింద(వేణుగోపాల) స్వామి అలయం ఎట్టకేలకు పురావస్తు, దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎట్టకేలకు స్వామికి మంచి రోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు. ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆలయం చుట్టుపక్కల 1.30 ఎకరాలు ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు. ఆక్రమణలు తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చరిత్ర
మెళియాపుట్టిలో 1840లో పర్లాఖిమిడి మహారాజు వీరేంద్ర ప్రతాప రుద్రడు తన భార్య విష్ణుప్రియ కోరిక మేరకు రాధాగోవింద స్వామి ఆలయాన్ని నిర్మించారు. రాతికట్టుతో ఆకట్టుకునే శిల్పాలతో నిర్మించిన ఈ ఆలయం ఖజురహోగా ప్రసిద్ధి చెందింది. గోపురం 108 తామర పువ్వులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాధాగోవిందస్వామిని భక్తులు కొలుస్తూ.. ఏటా డోలోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు.

చరిత్ర గల ఆలయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో పురావస్తుశాఖ రాష్ట్రంలో ఉన్న కొన్ని దేవాలయాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వేణుగోపాలస్వామిని కూడా తీసుకునేందుకు 1960 యాక్ట్‌ ప్రకారం 1991లో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా అధికారులకు ఎంతోకొంత ముట్టచెప్పినట్టు సమాచారం. ఇటీవల ఆలయ భూముల పరిరక్షణకు వచ్చిన దేవదాయశాఖ అధికారులపై కొంతమంది ఆక్రమణదారులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. దీంతో దేవాలయాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా ఆలయాన్ని అభివృద్ధి చేసి.. ఆక్రమణలు తొలగించేందుకు సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా పురావస్తుశాఖ సిబ్బంది ఆలయం చుట్టుపక్కల ఉన్న పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. త్వరలో కోటి రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు చేయనున్నారు.