News

కన్నులపండువగా మోదకొండమ్మ ఉత్సవాలు

550views

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. అలాగే పట్టణంలో కనులు మిరమిట్లుగొల్పేలా విద్యుద్దీపాలను అలంకరించారు. ఉత్సవ కమిటీ ఏర్పాటుచేస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి.

మోదకొండమ్మ జాతర తొలిరోజు ఆదివారం శతకంపట్టులో అమ్మవారిని కొలువుతీర్చారు. ఉదయం, సాయంత్రం అమ్మవారికి సేవలు అందిస్తున్నారు. అనుపోత్సవంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలును మంగళవారం తిరిగి ఆలయంలో అనుపుతీర్చే తంతును అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొలి రోజును మించి ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. రకరకాల నృత్యాలు, వేషాలు, డప్పుల వాయిద్యాల సందడి వాతావరణంలో ఉత్సవమూర్తిని, పాదాలును ఊరేగిస్తారు. అలాగే అనుపోత్సవం ముగిసిన తర్వాత బాణసంచా కాలుస్తారు. ఇది ఉత్సవాలకే ప్రత్యేకంగా ఉంటుంది. రాత్రంతా ఆయా కార్యక్రమాలను తిలకించి బుధవారం నుంచి భక్తులు స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతారు. రెండో రోజు భక్తులకు అవసరమైన మధ్యాహ్న భోజనాలు, తాగునీరు, మరుగుదొడ్లను ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులు సమకూర్చారు.