News

మనశ్శాంతి ఎలా?

1.4kviews

ఆత్మానందం కలగాలన్నా, మనశ్శాంతి లభించాలన్నా, మనలో కొంత వైరాగ్య భావన, ఉన్నదాంతో ఆత్మసంతృప్తి చెందే ధోరణి ఉండాలని పెద్దలు చెబుతారు. వైరాగ్యమంటే సన్యసించడమో, అన్నిటి మీదా విరక్తి¨ చెందడమో కాదు. తామరాకు మీద నీటిబొట్టులా ఉండటం. మనకు ఎంత ప్రాప్తమో అంత, దక్కని వాటి గురించి దుఃఖించనవసరం లేదనే పరిపక్వత. అలా లేకుంటే.. వైఫల్యాలు ఎంతగానో కుంగదీస్తాయి. భరతుడు అపరాధ భావనతో శ్రీరాముడికి చెందవలసిన రాజ్యాన్ని అప్పగించడానికి వచ్చినప్పుడు- వైరాగ్య భావన చాలా అవసరం అంటూ శ్రీరాముడు ఇలా ఉద్బోధిస్తాడు..

సర్వ క్షయాంతాః నిచయాః పతనాంతాః సముచ్ఛయాః
సంయోగా విప్రయోగాంతా మరణాంతం జీవితమ్‌

మనం సాధించిన ఈ ధనరాశులన్నీ ఏదో ఒకరోజు పతనమైపోతాయి. ఈ కలయికలు శాశ్వతం కావు. జీవితం ఎప్పుడూ మరణంతోనే పూర్తవుతుంది- అనేది ఈ శ్లోకానికి అర్థం. అందువల్ల అశాశ్వతమైన లౌకిక విషయాల కోసం మనసును పాడుచేసుకోకూడదు.. సహనాన్ని అలవరచుకుని, వైరాగ్య భావనతో, ఆత్మసంతృప్తితో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని గ్రహించాలి.