ArticlesNews

జూన్​ 7 నుంచి జ్యేష్ఠ మాసంలో విశేష పర్వదినాలు

75views

తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠమాసం. ఈ నెల విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

జ్యేష్ఠ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులున్నాయి…

దశపాపహర దశమి: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’ అని పిలుస్తారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. ఆ రోజు గంగామాత అవతరించిన రోజుగా చెబుతారు. అందుకే ఉత్తరాదిన ‘గంగా దశహర గంగోత్సవం’గా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు.

నిర్జల ఏకాదశి : జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఆ రోజు వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే జీవితకాలానికి సరిపడా పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు.

దశహరా: జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఆరోజు నది స్నానాలు చేయాలి. ఆ అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం.

మహాజ్యేష్టి: జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు.జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు.

వటసావిత్రి వ్రతం: జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు.