ArticlesNews

శబ్దం చేసిన ఆనంద తాండవం

117views

శబ్దం అంటే… ధ్వని మాత్రమే కాదు. అంతరంగాన్ని కదిలించే అద్భుత సాధనం. శబ్దం అంటే.. ఉచ్చారణ విధానం మాత్రమే కాదు.. శ్వాస నియంత్రణ ద్వారా యోగసాధన చేయించే మార్గం. శబ్దం అనంతశక్తికి నిలయం. విశ్వ ప్రతిస్పందనకు కేంద్రం. సమస్త వాఙ్మయ ఆవిర్భావానికి శబ్దమే మూలాధారం. అందుకే శబ్దం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అనంతమైన శబ్దశక్తితో శివుడినే కదిలించింది ‘శివతాండవ స్తోత్రం’.

రాక్షస వంశంలో పుట్టినప్పటికీ అఖండమైన శివభక్తిని తనువులోని ప్రతి అణువులో నింపుకొన్నాడు రావణాసురుడు. ఇష్టదైవం పరమేశ్వరుడిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఓ రోజు కైలాసానికి చేరుకున్నాడు. ఎంతసేపు నిరీక్షించినా శివుడు కరుణించలేదు. మొత్తంగా కైలాసపర్వతాన్నే పెకలిస్తానంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అనుకున్నదే తడవుగా తన ఇరవై చేతులతో కైలాసపర్వతాన్ని పెళ్లగించటం ప్రారంభించాడు. విశ్వమంతా చేష్టలుడిగి చూసింది. పరమేశ్వరి కూడా విస్తుపోయింది. శివుడు మాత్రం ఏమీ పట్టనట్టు ఆనంద తాండవం చేస్తున్నాడు.

రావణుడు గాఢమైన మూఢభక్తితో కైలాసాన్ని పెకలిస్తూనే.. ఆర్తితో తన ప్రాణదైవం శివుణ్ని అనేక విధాలుగా స్తోత్రం చేయసాగాడు. రాక్షసుడి నోటి నుంచి అద్భుతమైన స్తోత్రం ఆవిర్భవించింది. ‘ఏమిటా అద్భుత వర్ణన… ఏమిటా శబ్ద సౌందర్యం. ఏమిటా ఉపమాన విన్యాసం… అద్భుతం రావణా! భక్తుడవంటే నీవేనయ్యా’ అంటూ సృష్టి అంతా ముక్తకంఠంతో ప్రశంసించింది. దశకంఠకృత శివతాండవ స్తోత్రంగా విశ్వవిఖ్యాతి పొంది నేటికీ శివభక్తుల పాలిట కల్పవృక్షంగా ప్రకాశిస్తున్నది ఆ స్తోత్రరాజం. ‘అమంత్రం అక్షరం నాస్తి’- మంత్రం కాని అక్షరం లేదంటారు పెద్దలు. బీజాక్షరాల్లోని మంత్రశక్తి ఈ స్తోత్రంలో అంతర్లీనంగా సాగుతుంది. అందుకే శివతాండవ స్తోత్రాన్ని కేవలం స్తోత్రంగా కాకుండా మోక్షానికి దోవ చూపించే యోగసాధన విధానంగా గ్రహించాలి.