ArticlesNews

తోలు బొమ్మలకు జీవం

61views

తోలు బొమ్మలు పేరెత్తగానే ఠక్కున గుర్తొచ్చేది శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నిమ్మలకుంట గ్రామమే. ఇక్కడి కళాకారులు తోలుతో చేసిన కళాకృతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పలు దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. తోలుబొమ్మల కళాకారులు పలు భాషలు మాట్లాడడమే కాకుండా ఇతర దేశాల వారికి కూడా శిక్షణ ఇస్తున్నారంటే వీరి ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అనంత కీర్తిని అమెరికా దాకా తీసుకెళ్లిన నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులు నిత్యం కొత్త బొమ్మల తయారీలో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ మారుతున్నాయి. కాలానికి అనుగుణంగా తోలుబొమ్మలను తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ల్యాంప్‌సెట్స్‌, గోడలకు వేలాడదీసే బొమ్మలు, బ్యాగులు, గోడ గడియారాలు తదితర వాటిని తయారు చేస్తున్నారు.

80 కుటుంబాలకు ఉపాధి..
ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో నిమ్మలకుంట ఉంది. ఈ గ్రామంలో దాదాపు 300 కుటుంబాల దాకా వివిధ కులాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. వారిలో 80 కుటుంబాల వారు (మరాఠీ తెగకు చెందిన) తోలుబొమ్మల కళపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన తోలుబొమ్మలను బెంగళూరు, కలకత్తా, ముంబై, చైన్నె, ఢిల్లీ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మేకతోలును బొమ్మల తయారీకి ఉపయోగిస్తుంటారు. చర్మాన్ని బాగా కడిగి ఎండబెడతారు. ఎండిన చర్మంపై తయారు చేయాలనుకున్న బొమ్మను మొదట పెన్సిల్‌తో గీస్తారు. చిన్న చిన్న రంధ్రాల ద్వారా మిగతా భాగాన్ని తొలగించి రంగులు వేస్తారు. ఒక బొమ్మ తయారీకి రెండు లేదా మూడు రోజులు పడుతుంది. బొమ్మ నచ్చితే పెట్టిన పెట్టుబడికి ఐదింతలు వస్తాయని కళాకారులు అంటున్నారు.