News

అయ్యో పాపం.. ఇంకేమి పుణ్యస్నానం..?

57views

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఇంద్రపుష్కరిణి ఆధునికీకరణ ప్రతిపాదన అటకెక్కింది. నిధులు అందుబాటులో ఉన్నా.. పాలనా అనుమతులు పొందినా.. టెండర్లు సైతం ఖరారైనా వైకాపా అయిదేళ్ల పాలనలో పనులు ప్రారంభించలేకపోయింది. మూడేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ హడావుడి చేసి కాలం గడిపేశారు. వేసవిలో ఉన్న నీటిని ఇంజిన్ల సాయంతో తోడేసి భక్తులు స్నానాలు చేసేందుకూ ఆస్కారం లేకుండా చేశారు. గత వర్షాకాలంలో మురుగునీటిలోనే పుణ్యస్నానాలు చేయాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. పలు కారణాలతో పనుల్లో ఎడతెగని జాప్యం చోటు చేసుకుంది. దీంతో మంజూరైన పనులు రద్దు చేసేందుకు దేవాదాయశాఖ అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి అనుమతి పొందేందుకు చాలా రోజులు పడుతుంది.

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. పైగా పుష్కరిణిలో ఉన్న నీటిని తోడేయడంతో అరకొరగా ఏర్పాటు చేసిన కుళాయిలు వద్దే భక్తులు స్నానాలు చేయాల్సి వస్తుంది. అవి సరిపడక రద్దీ సమయాల్లో తలనీలాలు సమర్పించే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు ప్రత్యేకంగా స్నానపు గదులూ లేవు.