News

తొలకరి పలకరింపు

88views

రాష్ట్ర రైతాంగాన్ని తొలకరి పలకరించింది. మూడు నెలలుగా ఎండ తీవ్రత, వర్షాభావంతో అల్లాడిన ప్రజలు, రైతులకు ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మే 30న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని అనేక భాగాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు వరకు విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా జూన్‌ ఐదో తేదీకల్లా రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. అయితే దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఇంకా అరేబియా సముద్రం నుంచి పడమర గాలులు కేరళ వైపు బలంగా వీస్తుండడంతో రుతుపవనాల కదలికలో పురోగతి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆదివారం కేరళ, లక్షద్వీప్‌, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి.

ఆదివారం ఉత్తరకోస్తాలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల వరకు కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల పిడుగులు పడే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది.