ArticlesNews

దుగ్గిరాల ‘‘రామదండు’’.. జాతీయభావలు మెండు..

89views

(జూన్ 2 – దుగ్గిరాల గోపాల కృష్ణయ్య జయంతి )

చీరాల-పేరాల చరిత్రలో నిలిచిపోయిన స్వాతంత్ర్య సంగ్రామంలో ఓ ప్రత్యేక ఉద్యమం.నాటి గుంటూరు జిల్లాలో ఉన్న చీరాల యూనియన్ ను 1919 నవంబర్‌లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం చీరాల-పేరాల కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆకస్మికంగా ప్రకటించింది.ఇలాంటి పరిస్థితిలో ఆంగ్లేయులకు ఎదురు తిరుగుతూ చీరాల, పేరాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన మహనీయులు, ఆంధ్ర రత్న బిరుదాంకితులు శ్రీ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య.

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. బాపట్లలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి స్కాట్లాండ్‌లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తి చేశారు.

రాజమండ్రి, బందరులో కొంత కాలం ఉపాధ్యాయునిగా పని చేశారు. అనంతరం ఉద్యోగం వదిలి స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు. చీరాల-పేరాల ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆయన వందలాది మంది యువకులను చేరదీసి ‘‘రామదండు’’ పేరిట స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. చీరాల-పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేస్తే పన్నుల భారం అధికం అవుతుందని ప్రజలను గ్రామాలు ఖాళీ చేయంచి ఊరి వెలుపల గుడిసెలు వేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు.దీంతో బ్రిటిష్ ప్రభుత్వం మున్సిపాలిటీని రద్దు చేసింది. ఆ విధంగా దుగ్గిరాల గోపాల కృష్ణయ్య చుక్కానిగా నడిపించిన చీరాల-పేరాల ప్రజల ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

గొప్ప నాయకుడిగా, సాహసికుడిగా, వక్తగా, కవిగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్న మన ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య 40 ఏళ్ల చిన్న వయసులోనే అనగా 1928 జూన్ 10న అకస్మాత్తుగా దివికేగారు. ఆంధ్రులను స్వాతంత్ర్యం దిశగా కార్యోన్ముఖులను చేసిన దుగ్గిరాల వారు మనకు నిత్య స్మరణీయులు, స్ఫూర్తిప్రదాత.