ArticlesNews

2024 మే 31 నుంచి 2025 మే 31 దాకా అహల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు

77views

దేశమంతా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది మే 31 దాకా అహల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తెలివి, మేధస్సు, ధైర్యసాహసాలతో ఆమె మహారాణిగా ఎదిగారు. సువిశాల భూభాగంలో పరిపాలన చేసి ఎన్నెన్నో సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు, బాలిక విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ఆమె.

హిందూ ఆలయాల పునరుజ్జీవనం కోసం..
తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తే, గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణరంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత ఆమె. ఆమె హిందూధర్మ పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేశారు. విదేశీ పాలకుల వల్ల దేశ వ్యాప్తంగా ధ్వంసం అయిన 82 మందిరాలను తిరిగి నిర్మించారు. సోమనాథ్, రామేశ్వరం, కాశీ, గయ, పూరి, శ్రీశైలం… ఇలా అనేక మందిరాలను పునర్నిర్మాణం చేశారు. అన్నదాన సత్రాలను కట్టించారు. తన రాజ్యంలో అన్ని కులాల, మతాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించారు. కనుకనే టిప్పు సుల్తాన్‌ వంటి ముస్లిం రాజులు సైతం ఆమె ధార్మిక నిర్మాణాలకు అడ్డు చెప్ప లేకపోయారు.

ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు గౌరవించారు. 1795 ఆగస్ట్‌ 13న తన 70వ ఏట తనువు చాలించిన ఆమెను ధార్మిక ప్రవృత్తి కల్గిన పరిపాలకురాలిగా పాశ్చాత్య చరిత్రకారులు కొనియాడారు. ఆమె జన్మించి 300 ఏళ్లయింది. కర్మ యోగిగా, మాతృత్వం నిండిన రాణిగా ఆమెను పేర్కొనడం సముచితం.
– శ్యాంప్రసాద్‌ జీ, అఖిల భారతీయ సంరసతా ప్రముఖ్‌ (నేటి నుంచి అహిల్యాబాయి హోల్కర్‌ త్రిశత జయంతి ఉత్సవాలు ప్రారంభం)