News

రాత్రికి తీరం దాటనున్న రెమాల్ తుపాను

90views

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఉద్ధృతమై తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈ తుపాను బంగ్లాదేశ్ కేపుపారాకు దక్షిణ నైరుతి దిశగా 260 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బంగాల్ సాగర్ ఐలాండ్స్​కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపుపారా – వెస్ట్ బంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుపాను తీరం దాటనుంది.

తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో 80 కిలోమీటర్లు వేగంతో, ఉత్తర బంగాళాఖాతంలో 80 నుంచి 85 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్​పై తుపాన్ ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్తున్నారు. కానీ ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు, ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సాయంత్రం మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు