ArticlesNews

నాటి రామాయణం నేటి గ్రామాయణం

103views

లంకా విజయానంతరం రామచంద్రుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా జేసికొని కోసలరాజ్యాన్ని నవ్యంగా భవ్యంగా పాలించాడు. ఆ మహారాజు ధ్యేయం ప్రజల కష్టాలను పారద్రోలడం. రామరాజ్యములో ప్రజలందరూ ఆనంద హృదయార విందులే. అందరూ ధర్మాత్ములే రామునే దేవునిగా భావిస్తుండేవారే. నేటి గ్రామాయణములో వలె విద్వేషాలు నామమాత్రంగానైనా రామాయణ కాలములో లేవు.రాముడు రాజ్యం చేస్తుంటే ప్రజలు వేయేండ్లు జీవించేవారట. బహుపుత్ర సంతానం పొందేవారట. రోగమన్నదే ఎరుగరట.ఇక ఆనాడు ప్రజలు అశోకులైతే ఈ గ్రామాయణ కాలంలో సుశోకులౌతున్నారు. అన్నమో రామచంద్రాయని అరుస్తూనే ఉన్నారు. ధరవరలను చూచి గగ్గోలు పెడుతున్నారు.

పట్టాభిషేకంనాడు రాముడు తనకు ఇంద్రాదులవలన లభించిన కానుకలను తన మిత్రులకు వీరాధి వీరులకు పంచివేశాడు. ఇక మన నాయకులు మాత్రం ఊరుకొన్నారా? తనకు మంచి వదవి లభించగానే తనవారికే పదవులను, పారితోషికాలను పంచిపెడుతున్నారు. రామాయణ కాలములో ప్రజలందరు ధర్మనిరతులే. సత్యవ్రతులే, శుభలక్షణనంవన్నులే, ధర్మ పరాయణులే.

ఇక మన గ్రామాయణ కాలములోనో ధర్మం నాలుగు పాదాలతో గాదు నలభై పాదాలతో నడుస్తుంది. దానిమార్గాలు చీకటిబజారులు, పానశాలలు, జూదగృహాలు. ఇక సత్యదేవతా? అదెక్కడ? పంచదార పర్మిటు కావలసివస్తే పంచాయితీ ప్రెసిడెంటుననో, మంత్రిగారి మనిషిననో అనత్యం ఆడాలి. సత్యవ్రతం పూనినవాడు గ్రామాయణములో ఏది దొరకక చచ్చిపోతాడు. అందుకే మనం సత్యార్థం మానుకొన్నాము మార్చుకొన్నాము. ‘కాలానుమతోధర్మః’ అన్నారు గదా పెద్దలు. ఇక నేడు శుభ లక్షణాల కేమికొరత? హిప్పీలలాగు, హీరోలలాగు రకరకాల వేషాలు, రంగురంగుల పూతలు.
నాటి రామాయణముకంటె, నేటి గ్రామయణం అత్యద్భుతము, వర్ణనాతీతం. దీనిని వ్రాయడానికి అపర వాల్మీకి జనించాలి.