
శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం నుంచి ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఐదురోజులపాటు ఉగాది మహోత్సవాలను దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. కాగా శుక్రవారంతో మల్లన్న స్పర్శ దర్శనం ముగియనుంది. ఉగాది ఉత్సవాల్లో అలంకార దర్శనం మాత్రమేనని దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తా రన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ముఖ్యంగా కాలిబాట మార్గంలో వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠం బావి, భీముని కొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు లోటులేకుండా ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాలలో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలన్నీ సంపూర్ణంగా జరిపించేందుకు అవసరమైన ప్రణాళికలతో చర్యలు తీసుకున్నామని, క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షేత్రపరిధిలోని ఆరుబయలు ప్రదేశాలు, పార్కింగ్ తదితర ప్రదేశాలలో భక్తులు సేదతీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.





