News

ఏప్రిల్‌ 2న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

340views

తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 9న ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

ఇందులో భాగంగా ఏప్రిల్‌ 2న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారని చెప్పారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆల‌యాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని వివరించారు.

ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని తెలిపారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు.