ArticlesNews

వైదిక మార్గం, జాతీయతా భావం, దళిత స్పృహల త్రివేణీ సంగమం

7views

( సెప్టెంబర్ 19 –  బోయి భీమన్న జయంతి )

కుల మత వర్గ విభేద రహితమైన భారత జాతి ఆవిర్భావమే ధ్యేయంగా సాహిత్య సృజన చేసిన జాతీయవాది బోయి భీమన్న. తాను పుట్టిపెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే ఆత్మగౌరవంతో జీవించాలన్న ఆకాంక్ష జాతీయవాదంలో ఉంటుందని వివరించి, జీవితాంతం జాతీయవాదిగానే ఉన్న సాహిత్యకారుడు బోయి భీమన్న. కుల వ్యవస్థను నిరసిస్తూనే వైదిక జీవన విధానాన్ని పాటించాలని పిలుపునిచ్చిన స్వతంత్ర సృజనశీలి ఆయన.

బోయి భీమన్న 1911 సెప్టెంబర్ 19న ప్రస్తుత కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో ఒక నిరుపేద హరిజన కుటుంబంలో పుల్లయ్య, నాగమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వేదాంత తత్వగీతాలు, తల్లి పాడే ఏలపాటలు, తుమ్మెదపాటలతో భీమన్నమౌలిక వేదాంత ఆలోచనాపరుడిగా, సౌందర్యోపాసకుడిగా పెరిగారు. జాతీయోద్యమ నేపథ్యంతో సామాజిక చైతన్యాన్ని సంతరించుకున్నారు. ఆయన పాత్రికేయుడిగా, ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ అనువాదశాఖ సంచాలకుడిగా, శాసనమండలి సభ్యుడిగా విభిన్న హోదాల్లో పనిచేసారు. భావకవిత్వాన్ని సృజిస్తూనే సమాజంలోని అంతరాలను తొలగించే చైతన్యశీలమైన సాహిత్యాన్నీ సృష్టించారు.

బోయి భీమన్న తెలుగు సాహిత్యంలో గొప్ప ప్రయోగవాది, సిద్ధాంతకర్తగా విమర్శకుల మెప్పు పొందారు. అద్వైత విశిష్టాద్వైతాలకు బదులుగా ‘రసాద్వైతాన్ని’, సోషలిజానికి ప్రతిగా ‘శివ సామ్యవాదాన్ని’, వర్ణ వర్గ వ్యవస్థలకు బదులుగా ‘వన్య వ్యవస్థ’నూ ప్రతిపాదించి తన రచనల్లో వాటికి విస్తృత ప్రచారం కల్పించారు. బ్రిటిష్ పాలనాకాలంలో నాటి సాహితీవేత్తలు జాతీయోద్యమ స్పృహతో రచనలు చేస్తున్నవేళ బోయి భీమన్న భారతదేశపు ఆధ్యాత్మిక పౌరాణిక సాంస్కృతిక వారసత్వానికి పునాదులు వేసింది దళితులేనంటూ రచనలు సాగించారు. అసలైన భారతీయ వారసత్వ గరిమను, మూలవాసుల విశిష్టతనూ వెల్లడించారు. పౌరాణిక పద్య నాటకాలే కాక… సాంఘిక నాటకాలు కూడా రచించి వాటిద్వారా దళితుల్లో విద్యా చైతన్యాన్ని, రాజ్యాధికార భావననూ పెంపొందింపజేసారు. భీమన్న తన సాహిత్య సృజనలో మొదటినుంచీ దళిత స్పృహ చూపించారు. అంబేద్కర్ రచనను ‘కుల నిర్మూలన’ పేరుతో అనువదించారు. ఆయన రచించిన ‘ధర్మం కోసం పోరాటం’ గ్రంథం అంబేద్కర్ సిద్ధాంతాలకు దర్పణంగా నిలిచింది. కుల సమస్య తీవ్రత, దళితుల స్వీయ ఉద్ధరణ, వర్గ కుల పోరాటాల వైఖరి, సంస్కరణ ఉద్యమాల వైఫల్యం, ప్రజాస్వామిక సోషలిజం వంటి అంశాలను చర్చించింది. బోయి భీమన్న వందకు పైగా పాటల ద్వారా అంబేద్కర్ ప్రబోధాలను తెలుగువారికి అందించారు.

అదే సమయంలో బోయి భీమన్న వైదిక భావజాలాన్ని సమర్థించారు. ‘‘గో బ్యాక్ టు వేదాస్’’ అని పిలుపునిచ్చారు. వేదకాలంలో కులం లేదని, వృత్తిగతంగానే మనిషికి గుర్తింపు ఉండేదనీ ఆయన భావన. వైదిక సమాజ వైభవాన్ని అంగీకరిస్తూనే అంబేద్కర్ తాత్విక చేతనను ప్రచారం చేసారు. కేవలం దళిత చైతన్యం దగ్గరే ఆగిపోకుండా మానవతావాదం, ప్రేమతత్వం, జాతీయవాద దృక్పథం, ప్రగతిశీల దృష్టితో సాహితీ వ్యవసాయం చేసారు. మాల మాదిగల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ‘మామాలు’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు వంటివారు దళితులే కాబట్టి వారు రచించిన రామాయణ భారత భాగవతాదులను తమవేనని చాటారు. కర్మసిద్ధాంతం ప్రకారం వర్ణవివక్ష పాటించకూడనిది అంటూ ‘జన్మాంతర వైరం’ అనే కావ్యం రచించారు. కులనిర్మూలన వేదవిహిత కార్యంగా ఉండాలని ప్రతిపాదించిన విశిష్ఠ సాహితీమూర్తి ఆయన.

బోయి భీమన్న రచనలు సామాజిక సమరసతకు నిలువెత్తు నిదర్శనాలు. సమాజ సంస్కరణకు మార్గదర్శకాలు. అందుకే ఆయనను కళాప్రపూర్ణ, సాహిత్య అకాడెమీ పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ పురస్కారాలతో గౌరవించింది. సుమారు డెబ్భై రచనలు చేసిన బోయి భీమన్న వ్యక్తిత్వం, సాహితీ మూర్తిమత్వం తెలుగువారందరికీ ఆదర్శప్రాయం.