
భారత స్వాతంత్ర ఉద్యమ రోజుల్లో పుల్లెల శ్యామ సుందరావు పేరు తెల్లవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పోరాట యోధుడిగానే కాకుండా అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్ గా ఆయన తన వంతు పాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నివాసి. బరంపురంలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో ఆపేసి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1922 ఫిబ్రవరి 8 నుండి సెప్టెంబర్ 14 వరకూ బరంపూర్, కడలూరు జైళ్లలో ఏడు నెలల ఏడు రోజులు గడిపారు.
కల్లుదుకాణాల పికెటింగ్ జరిపినందుకు ఆయన ఆ శిక్షను అనుభవించారు. సహాయనిరాకరణ ఉద్యమ ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడానికి జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించారు.
1930 ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా బరంపురం, కడలూరు జైళ్లలో మరోసారి 1932 జనవరి 16 నుండి శిక్షను అనుభవించి, వంద రూపాయలు జరిమానా చెల్లించారు. 1934, 35 మధ్య బర్మాలోని ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తరువాత సంవత్సరం తుపాను బాధితుల సహాయార్థం అవిరామంగా శ్రమపడ్డారు. వచ్చాక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా, జిల్లా కమిటీ కార్యదర్శిగా, అధ్యక్షుడుగా వ్యవహరించి 1937 లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1940లో ఆంధ్ర కిసాన్ సభ అధ్యక్షుడుగా పనిచేశారు. ఇచ్చాపురం లో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురై 1940 జూన్ 16 న మరణించారు.



