News

రాజస్థాన్లో ఆరెస్సెస్ శాఖపై దాడి – పోలీసుల తీరుపై నిరసనలు.

1kviews

రాజస్థాన్లోని బూందీలో ఆరెస్సెస్ శాఖపై జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బూందీలోని స్థానిక నావల్ సాగర్ పార్కులో ప్రతిరోజూ ఆరెస్సెస్ శాఖ జరుగుతూ ఉంటుంది. అయితే బుధవారం ఉదయం కొంతమంది గుంపుగా శాఖ జరుగుతున్న స్థలానికి వచ్చి శాఖని జరుగనివ్వబోమని అడ్డుకోవడంతో మొదలయిన ఘర్షణ హింసాత్మక రూపం దాల్చింది. ఈ ఘటనలో పలువురు పెద్దలతో సహా శాఖలో పాల్గొనే యువకులు, బాలురపై కూడా దుండగులు దాడికి తెగబడ్డారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న స్థానిక ఆరెస్సెస్ కార్యకర్తలు నిందితులను శిక్షించవలసినదిగా పోలీసులను డిమాండ్ చేశారు.

ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఐదుగురు నిందితులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామని,  టోంక్ కు చెందిన సద్దాం, షహీద్, షఫీ మొహమ్మద్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లుగా బూందీ ఎస్పీ మమతా గుప్తా వెల్లడించారు.

ఎమ్మెల్యే మదన్ దిలావర్

కాగా ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా కలకలం సృష్టిస్తోంది. జరిగిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ శ్రేణులపై జరిగిన జరిగిన దాడిని బీజేపీ ఏమాత్రం సాహించదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాఖపై దాడి చేసిన దుండగులు యాభై మందికి పైగా ఉండగా కేవలం ఐదు మందిపై మాత్రమే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసుల తీరుపై కూడా సదరు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

జరిగిన ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించి నిందితులెవరైనా కఠినంగా శిక్షించి తీరుతామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.