News

“జై శ్రీరాం” అన్నందుకు ఏడేళ్ళ బాలుడ్ని చితకబాదిన స్కూల్ టీచర్ – బెంగాల్లో ఘటన

789views

జై శ్రీరాం” అన్నందుకు పసివాడని కూడా చూడకుండా ఏడేళ్ళ బాలుడ్ని ఓ స్కూల్ టీచర్ చితకబాదిన సంఘటన బెంగాల్లోని హౌరా జిల్లాలోని శ్రీ రామకృష్ణ శిక్షాలయలో చోటు చేసుకుంది.

బెంగాల్లోని హౌరా జిల్లాలోని శ్రీ రామకృష్ణ శిక్షాలయలో చదువుతున్నఏడేళ్ళ ఆర్యన్ సింగ్ అనే బాలుడు పాఠశాల తరగతి గదిలో “జై శ్రీరాం” అని నినదించాడు. దానితో తోటి విద్యార్థులు కూడా అదే నినాదాన్ని అందుకున్నారు. ఇది విన్న ఆ పాఠశాల అధ్యాపకుడొకరు బాలునిపై తీవ్రంగా ఆగ్రహించి పసివాడని కూడా చూడకుండా తీవ్రంగా దండించారు. అంతటితో ఆగకుండా పాఠశాలలోగాని, బయటెక్కడైనాగాని “జై శ్రీరాం” అని నినదిస్తే ఇదే గతి పడుతుందని బాలుడ్ని హెచ్చరించారు.

దీంతో భయకంపితుడైన బాలుడు తీవ్రమైన షాక్లో ఉన్నాడని బాలుడి తండ్రి వెల్లడించారు. తన కుమారుడు చాలా చురుకైన వాడని, అందుకే తాము కూడా అన్ని విషయాల్లో బాలుడ్ని ప్రోత్సహిస్తూ ఉంటామని, బాలుడు ఇంతగా భయకంపితుడు కావడం తామెప్పుడూ చూడలేదని, ఇప్పుడు స్కూలు పేరెత్తితేనే బాలుడు గజగజ వణికిపోతున్నాడని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ అయితే నేను దేవుడి పేరెత్తడం తప్పా నాన్నా?” అని బాలుడు ప్రశ్నిస్తూ ఉంటే ఏమని సమాధానం చెప్పాలో అర్ధం కావడం లేదని ఆ తండ్రి తెలిపారు. తీవ్రమైన భయానికి లోనైన బాలుడు పాఠశాలకు వెళ్ళడానికి కూడా నిరాకరిస్తున్నాడని ఆయన తెలిపారు.

Source : SwarayaMag

https://m.ritam.app/Encyc/2019/7/12/seven-year-old-student-brutally-beaten-up-by-teacher-for-raising-jai-shri-ram-slogans-in-west-bengal-school-.amp.html