
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు, ప్రవాస భారతీయులు సోమవారం ప్రత్యేక పూజలు, కార్ల ర్యాలీలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలోని ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్’పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన రామ భక్తులు ఈ వేడుకను వీక్షించారు. భక్తి పాటలు, నృత్యాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వర్జీనియాలోని లోటస్ టెంపుల్‌లో సిక్కులు, ముస్లింలు, పాకిస్థానీ అమెరికన్లు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా నగరం లాస్ ఏంజెలిస్‌లో 250 కార్లతో ర్యాలీ నిర్వహించారు.
యూఎస్, కెనడాల్లో 45 రోజుల యాత్ర
అయోధ్యలో విగ్రహప్రతిష్ఠ జరిగిన వెంటనే అమెరికాలోని ప్రపంచ హిందూ మండలి, కెనడా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సంస్థలు రెండు దేశాల్లోని 1,000కి పైగా ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా రామమందిర యాత్రను ప్రకటించాయి. మసాచుసెట్స్‌లోని బిల్లేరికాలో మార్చి 25నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుందని వీహెచ్‌పీ తెలిపింది. 45రోజుల పాటు అమెరికా, కెనడాల్లో ఈ యాత్ర కొనసాగనుందని వీహెచ్‌పీ వెల్లడించింది.
ట్రినిడాడ్ అండ్ టొబాగోలోనూ
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్, టొబాగో దేశంలో నివసించే భారతీయ మూలాలున్న 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.
మెక్సికోలో మొదటి రామమందిరం
అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠకు ఒకరోజు ముందే మెక్సికోలోని క్వెరెటారో నగరంలో మొదటి రామమందిరాన్ని ప్రారంభించారు. భారత్ నుంచి తీసుకువచ్చిన రామయ్య విగ్రహానికి అమెరికన్ పూజారి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఫిజీ రాజధాని సువాలో భారతీయ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో రామ్‌లల్లా ఉత్సవాలను ఈ నెల 18నుంచి 22 వరకు నిర్వహించారు.తూర్పు ఆఫ్రికాలోని మారిషస్ దేశం హిందుత్వ భావాలున్న ప్రభుత్వ ఉద్యోగులు పూజలు చేసుకునేందుకు వీలుగా రెండు గంటల పాటు విరామం ప్రకటించింది. ‘రాముడు తిరిగి అయోధ్యకు చేరుకోవడం ఆనందించాల్సిన విషయం. మనలోని శాంతిని, శ్రేయస్సును పెంపొందించేందుకు ఆయన ఆశీర్వాదాలు, బోధనలు ఎల్లప్పుడూ ఉండాలి’ అని మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.




