
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతేకాదు.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన అనంతరం భక్తులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దీన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ స్క్వేర్‌లో రామ మందిరాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. ఆ రోజున టైమ్స్ స్క్వేర్‌లో రామమందిర చిత్రాన్ని ప్రదర్శించారు.





