News

రామా.. ప్రసాదాలకు నోచలేమా

297views

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో కొలువైన సీతారామలక్ష్మణమూర్తులకు నైవేద్యం సమర్పణకు కనీసం ప్రసాదాలు కూడా పూర్తిస్థాయిలో తయారు చేయడం లేదు. సరకుల కొరత ఉందని, సరిపడా సకాలంలో ఇవ్వడం లేదు. శ్రీవారి పోటులో ఒక రకం చేస్తే మరొకటి సిద్ధం చేయడం లేదు. రామయ్య క్షేత్రంలో నిత్యం ఉదయం 7.45 నుంచి 8.15 గంటలకు పెరుగన్నం, కట్‌ పొంగలి, 10.45 నుంచి 11.15 గంటల వరకు పులిహోర, చక్కెర పొంగళి చేసి సమర్పించాలి. మూడో దఫా సాయంత్రం 5.45 – 6.15 గంటల మధ్య మలిహోర, క్షీరాన్నం నివేదనగా అందించాలి. పూజా కైంకర్యాలు పూర్తయిన తర్వాత రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులకు పంపిణీ చేయాల్సి ఉంది.

మూడు రోజులుగా సరకుల సరఫరా చేయలేదని క్షీరాన్నం సిద్ధం చేయడం లేదు. ఒక రకంతోనే సరిపెట్టేస్తున్నారు. ఆలయంలో పనిచేస్తున్న పరిపాలన అధికారులు, సిబ్బంది, నిఘా, భద్రతా విభాగం యంత్రాంగం, అర్చకులు ఏం చేస్తున్నారని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు. టిటిడి గొప్ప ధార్మిక సంస్థగా ఎనలేని బహుళ ప్రాచుర్యం పొందింది. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పర్యవేక్షణ కొరవడింది. రాష్ట్ర అధికారిక గుర్తింపు పొందిన ఆలయంలోనే రామా ప్రసాదాలకు నోచలేమా అనే ప్రశ్న వినిపిస్తోంది. సాయంత్రం వేళ వస్తున్న భక్తులకు మొన్నటివరకు రెండు రకాల ప్రసాదాలు పంపిణీ చేయడంతో స్వీకరించారు. మూడు రోజులుగా సాయంత్రం పూట మాత్రమే తయారు చేస్తున్నా ఇక్కడ పట్టించుకునే వారు కరవయ్యారు. అధికారుల పర్యవేక్షణ ఉంటే ఇంతటి అధ్వాన పరిస్థితులు ఎందుకు ఉంటాయని యాత్రికులు ప్రశ్నిస్తున్నారు.