
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెలో మారమ్మ ఆలయం నుంచి హిందూ జన జాగృతి సంఘ్ ప్రతినిధులు, భక్తులు చేపట్టిన అయోధ్య రామయ్య శోభాయాత్ర ఒంటిమిట్టకు శనివారం చేరింది. రాములోరి సన్నిధిలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వారికి స్వాగతం పలికారు. రామ జన్మభూమి ఆయోధ్యలో ఈ నెల 22న శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ఠ చేయనున్న నేపథ్యంలో సంఘీభావంగా ద్విచక్ర వాహనాలపై ప్రదర్శనగా వచ్చారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను దర్శించారు. తిరుపతి, ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ఇస్కాన్ ప్రతినిధులు ముకుంద శ్యామ్‌దాస్, రాధాకృష్ణ దాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. హిందూ జన జాగృతి సంఘ్ ప్రతినిధులు బి.రాజశేఖర్‌రెడ్డి, హిమగిరి యాదవ్, విశ్వనాథ్, విజేయుడు, శివయాదవ్, నరసింహులు, సుబ్రహ్మణ్యం, అనుదీప్ పూర్ణానంద్ పాల్గొన్నారు.



