
ముంబయికి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ టీటీడీకు రూ.5 కోట్ల విలువైన గాలిమరను విరాళంగా అందించింది. తిరుమల జీఎన్సీ ప్రాంతంలో ఈ గాలిమర ఏర్పాట్లను టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీ ఎస్ఈబీ) నుంచి అనుమతులు వచ్చాక టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారని తెలిపారు. 53 విద్యుత్ గాలిమర ద్వారా సంవత్సరానికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీంతో ఏటా టీటీడీకు రూ. కోటి ఆదా అవుతుందని చెప్పారు. టీటీడీ అవసరాలకు 15 ఏళ్ల క్రితమే ఈ కంపెనీ వారు 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు గాలిమరలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ వారే చూసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న గాలిమర నిర్వహణను కూడా వీరే చూడనున్నారని ఈవో తెలిపారు.




