News

తొలిసారిగా ఉత్తరాఖండ్ లోని ఆలయంలో మహిళా అర్చకుల నియామకం

274views

ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా పితోర్‌గఢ్ జిల్లాలోని ఓ ఆలయంలో మహిళా పూజారులను నియమించారు. మహిళా అర్చకులను నియమిస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. పితోర్‌గఢ్‌ జిల్లా చందక్‌లోని సిక్రదాని గ్రామంలోని యోగేశ్వర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో తొలిసారిగా ఇద్దరు మహిళలు పూజారులుగా నియమితులయ్యారు.

ఈ సందర్బంగా.. మహిళా అర్చకులకు అక్కడి ప్రజలు పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆచార్య డాక్టర్ పీతాంబర్ అవస్థి ప్రధాన పూజారి బాధ్యతలను మంజుల అవస్థికి, సహాయ పూజారి సుమన్ బిష్త్‌కు అప్పగించారు.

తమ కుటుంబ సంతోషం మరియు శ్రేయస్సు కోసం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉపవాసాలు చేస్తారని.. స్త్రీలు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సనాతన ధర్మాలను సజీవంగా ఉంచుతున్నారని ఆలయ కమిటీ పేర్కొంది.

ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ పీతాంబర్ అవస్థి మాట్లాడుతూ మహిళలు పైలెట్లు, వ్యోమగాములుగా విజయాలు సాధిస్తున్నారన్నారు. ఇప్పుడు అన్నీ మారాయని, మార్పు వచ్చిందని,
మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు కొనసాగుతాయని అన్నారు.

యువ సాహితీవేత్త, నీరజ్ చంద్ర జోషి మాట్లాడుతూ ఆలయ కమిటీ తొలిసారిగా మహిళలను ఆలయ పూజారులుగా నియమించి మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

Source – దైనిక్ జాగరణ్