News

ప్రజ్ఞాన్‌ తిరిగి క్రియాశీలంగా మారే అవకాశం ఉంది : ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడి

276views

జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్‌-3 రోవర్‌ (ప్రజ్ఞాన్‌) తిరిగి క్రియాశీలంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. అందుకు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పారు. కొచ్చిన్‌లో గురువారం ఓ వార్తాసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘జాబిల్లిపై ప్రస్తుతం ప్రజ్ఞాన్‌ ప్రశాంతంగా నిద్రిస్తోంది. దాన్ని కదిలించకుండా.. నిద్రపోనిద్దాం. తనంతట తాను క్రియాశీలమవ్వాలని అనుకున్నప్పుడు అది మేల్కోగలదు’’ అని పేర్కొన్నారు. రోవర్‌ను తాము మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద పరీక్షించినప్పుడు అది పనిచేసిందని సోమనాథ్‌ తెలిపారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ మళ్లీ క్రియాశీలమవుతుందని ఆశలు పెట్టుకోవడానికి అదే కారణమని చెప్పారు.