
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలానక్షత్రం సందర్భంగా ఆరో రోజు శుక్రవారం సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. మూలానక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్ష్రత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. గురువారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వాహనాలను కొండపైనే కాకుండా ఆలయ పరిసరాల్లోకి కూడా పోలీసులు అనుమతించట్లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దుర్గగుడికి రానున్నారు. ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.





