News

అవయవ దానం ప్రతిజ్ఞల్లో మహిళల ముందంజ

254views

అవయవ దానం చేసేందుకు పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ముందుకు వస్తున్నారు. ఈ మేరకు నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌వోటీటీవో) తాజాగా ప్రారంభించిన వెబ్‌సైట్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆధార్‌ ధ్రువీకరణ సంతకంతో అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ఇటీవలే ఎన్‌వోటీటీవో ప్రారంభమైంది. ఈ క్రమంలో సెప్టెంబరు 16 నుంచి అవయవ దానానికి ముందుకొచ్చి ప్రతిజ్ఞ చేసినవారి సంఖ్య బుధవారం నాటికి 82 వేలకు పైగా నమోదైంది. వీరిలో ఎక్కువ మంది 30 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసువారు ఉన్నట్లు వెబ్‌సైట్‌ ఎన్‌వోటీటీవో.ఏబీడీఎం.జీవోవీ.ఐఎన్‌. సమాచారం పేర్కొంది.

ఆ ప్రకారం 30-44 ఏళ్ల మధ్య ఉన్నవారు 40,320 మంది, 18-29 మధ్య వారు 21,751 మంది, 45-59 మధ్య ఉన్నవారు 18,160 మంది, 60 ఏళ్లు అంతకు మించిన వారు 2,592 మంది అవయవ దానానికి ప్రతిజ్ఞ చేశారు. వీరిలో 47,094 మంది మహిళలు, 35,726 మంది పురుషులు, 12 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 23,369 మంది ముందుకు రాగా ఆ తరువాత స్థానాల్లో మధ్యప్రదేశ్‌ (18,847), తెలంగాణ (11,564) ఉన్నాయి. ఎక్కువ మంది కిడ్నీ దానానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మరికొంత మంది గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమం, పేగులు, కార్నియా, చర్మం, ఎముకలు, గుండె నాళాలు, రక్త నాళాలు, మృదులాస్థి ఇచ్చేందుకు ప్రతిజ్ఞ చేశారు. దేశంలో పెద్ద ఎత్తున అవయవాల అవసరం ఉందని, ఎంతో మంది అవయవ వైఫల్యాలతో బాధపడుతున్నారని ఎన్‌వోటీటీవో డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ వెల్లడించారు.