
కొత్త సంవత్సరంలో స్వామి వారిని దర్శనం చేసుకుని తమకు సంవత్సరం అంతా శుభం కలగాలని చాలా మంది భక్తులు జనవరిలో కొండ పైకి వెళతారు. అలా వెళ్లాలనుకునే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి టీటీడీ ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశం దర్శనం, వసతి గదుల కోటాకు సంబంధిచి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకారణ సేవ టికెట్లను అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. వర్చువల్ సేవా టోకెన్‌లను అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఆంగప్రదక్షిణ కోటా టికెట్లు..
జనవరి నెలకు సంబంధించిన ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను కూడా టీటీడీ విడుదల చేయనుంది. వీటిని అక్టోబర్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాకు సంబంధించి అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. భక్తుల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కోసం అక్టోబర్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు టికెట్లు విడుదల చేస్తారు.





