
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ-ఓటరు గుర్తింపు కార్డు(ఈ-ఎపిక్)ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అందుకోసం వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేసింది. ఈ విధానంలో మొబైల్ నంబరు నమోదుతో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫాం-8నే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులో మొబైల్ నంబరు నమోదుకు ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్ చేసి నమోదు చేసిన తరవాత దరఖాస్తును సబ్‌మిట్ చేయాలి. ఆ తరవాత https://voters.eci.gov.in లో e-epic విభాగంలోకి వెళ్లి నిర్ధారిత ప్రాంతంలో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. వెంటనే ఏ మొబైల్ నంబరు నమోదుచేశామో, ఆ ఫోన్‌ను ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదుచేయగానే ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. ‘ఆ పత్రం అన్ని ధ్రువపత్రాల మాదిరిగా చెల్లుబాటు అవుతుంది. ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ సదుపాయం గతంలోనూ ఉన్నప్పటికీ, అది ఆమోదం పొందేందుకు అధిక సమయం పట్టేది. నమోదిత వివరాలు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆమోదించిన తరవాత ఆ ప్రక్రియ పూర్తయ్యేది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను సరళతరం చేసింది.





