News

సిక్కింలో ఆకస్మిక వరదలు ; 14 మంది మృతి.. 102 మంది గల్లంతు

351views

ఆకస్మిక వరదలతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో లాచెన్‌ లోయలోని తీస్తా నది కి భారీగా వరద వచ్చి చేరడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది బేసిన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 102 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆకస్మిక వరదల కారణంగా సుమారు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

పరిస్థితి తీవ్రత నేపథ్యంలో ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సిక్కిం ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది.

వరదల తీవ్రతకు లాచెన్‌ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి. సింగ్తమ్‌ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. అందులోని 22 మంది గల్లంతైనట్టు ఆర్మీ ఈస్ట్రన్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోవడంతో అక్కడి ఆర్మీ సిబ్బందిని సంప్రదించడం కష్టంగా మారిందని సైనిక వర్గాలు తెలిపాయి.