
జాతీయ జెండాను అగౌరవపరిస్తే భారత్ సహించబోదని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. గత నెలలో లండన్‌లోని భారత హై కమిషన్ ఎదుట ఖలిస్థానీ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైకమిషన్‌లోని జెండాను తొలగించి దాని స్థానంలో ఖలిస్థాన్ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటన గురించి జై శంకర్ ప్రస్తావిస్తూ, లండన్‌లోని భారత హైకమిషన్‌లో మరింత పెద్ద జెండాను ఏర్పాటు చేసి ఖలిస్థాన్ మద్దతుదారులకు, బ్రిటన్ వారికి సందేశాన్ని ఇచ్చామని అన్నారు.
‘‘గత కొన్ని రోజులుగా కెనడా, లండన్, ఆస్ట్రేలియా, శాన్ ఫ్రాన్సిస్కోలలో జరిగిన ఘటనలను మీరు చూసే ఉంటారు. ఇది మనుపటి భారత్ కాదు, జాతీయ జెండాను అగౌరవపరిస్తే చూస్తూ సహించే భారత్ కాదు ఇది.
లండన్‌లోని భారత హైకమిషన్‌లో ఈ ఘటన జరిగిన వెంటనే భారత హైకమిషనర్ అక్కడ మరింత పెద్ద జెండాను ఎగురవేశారు. ఖలిస్థానీ మద్దతుదారులకే కాదు, ఎవరైనా భారత జెండాను అగౌరవపరిస్తే బ్రిటన్‌లో మరింత పెద్ద భారత జెండా పైకి ఎగురుతుందనే సందేశాన్ని బ్రిటన్ వారికి ఇవ్వడమే దీని వెనుక మా ఉద్దేశం’’ అని ఆయన అన్నారు.





