
భారత ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించినందుకు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారతీయ సామాజిక సమరసతా మంచ్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఆ మేరకు సామాజిక సమరసతా మంచ్ జాతీయ కన్వీనర్ శ్రీ K. శ్యాంప్రసాద్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనను యదాతథంగా తెలుసుకుందాం.
పత్రికా ప్రకటన
జనవరి 24, 2022
పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించినందుకు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు.
పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మూడు సంవత్సరాలు పొడిగించినందుకు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని సామాజిక సమరతా మంచ్ హృదయపూర్వకంగా అభినందిస్తోంది.
పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కమిషన్ పదవీకాలాన్ని అత్యధికంగా ఒక సంవత్సరం, కొన్నిసార్లు కేవలం ఆరు నెలలపాటు మాత్రమే పొడిగించేది. దీని కారణంగా కమీషన్ సమర్థవంతంగా పనిచేయలేదు.
కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖా మంత్రి 02.12.2021న దేశంలో 43,797 మంది పారిశుధ్య కార్మికులను గుర్తించామని లోక్ సభలో ప్రకటించారు. వారిలో 42,500 మందికి పైగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులను వారి వృత్తి కారణంగా అంటరానివారిగా పరిగణిస్తారు. సమాజంలోని అన్ని వర్గాల వారి చేతిలో వారు అవమానానికి గురయ్యారు.
నిజానికి ప్రభుత్వం 1993లోనే సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేసినా ఇంతవరకు వారి సమస్యలు పరిష్కారం కాలేదు. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మురుగు కాలువలు శుభ్రం చేస్తూ ఎంతో మంది మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. 23.12.2021న, మహారాష్ట్ర (సోలాపూర్)లో నలుగురు, 16.12.2021న గుజరాత్ (అహ్మదాబాద్)లో ముగ్గురు, 24.09.2021న మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లో ముగ్గురు, 15.01.2022న తమిళనాడు (చెన్నై)లో ఒకరు, 19.01.2022న తమిళనాడు (కాంచీపురం)లో ఇద్దరు మరణించారు.
ఇప్పటి వరకు 671 మంది బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల పంపిణీకి గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కమిషన్ సమర్థవంతమైన పాత్రను పోషించింది. ఈ చెల్లింపు పారిశుధ్య పనిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబానికి అందించబడుతుంది.
దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ పారిశుధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాయి. కాంట్రాక్టర్లు చట్టాలు, నిబంధనలు పాటించకపోవడంతో వల్ల మురుగు కాల్వలలో పడి మరణించేవారి సంఖ్య తగ్గడం లేదు. కఠినమైన నిబంధనలు, విధానాలు, చట్టాలు ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ చట్టంలోని కొన్ని లొసుగులను ఉపయోగించుకుని చట్టానికి దొరక్కుండా తప్పించుకోగలుగుతున్నాడు. దాంతో బాధిత కుటుంబానికి చట్టపరంగా అందవలసిన ప్రయోజనాలు అందటం లేదు. మురుగు కాలువలలో పడి మరణించేవారి సంఖ్యను సమర్థవంతంగా తగ్గించాలంటే కమీషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం.
పారిశుధ్య కార్మికుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. పారిశుధ్య పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల సమస్యలకు ప్రత్యక్ష బాధ్యత వహించదు. నిజానికి పారిశుధ్య కార్మికుల ప్రాథమిక సమస్యల పట్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మురుగు కాల్వలలో పడి మరణించేవారి సంఖ్య ఎక్కువ. కరోనా మహమ్మారి సమయంలో పారిశుధ్య కార్మికులు ఆరోగ్య సైనికులు (ఫ్రంట్లైన్ వర్కర్స్) గా పనిచేశారు.
పారిశుధ్య కార్మికుల జాతీయ కమీషన్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి కమీషన్ కు మరిన్ని రాజ్యాంగ అధికారాలను ఇవ్వాలి. పారిశుధ్య కార్మికులకు సామాజిక గౌరవాన్ని, సమానత్వాన్ని అందించడానికి సామాజిక సమరసతా మంచ్ కట్టుబడి ఉంది.
భవదీయులు
K.శ్యామ్ ప్రసాద్, అఖిల భారత కన్వీనర్,
సామాజిక సమరసతా మంచ్,
syamprasadk56@gmail.com
9440801360


పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పెంచాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యతో తాము దశాబ్దాలుగా అనుభవిస్తూ ఉన్న అనేక అవమానాలకు, బాధలకు సరయిన పరిష్కారాలు లభించే అవకాశం ఉన్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏవైనా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు తమకు, తమ కుటుంబాలకు ప్రభుత్వం యొక్క అండ లభిస్తుందనే ఆలోచన తమకు చక్కటి భరోసాను కల్పిస్తున్నదని వివిధ రాష్ట్రాలలోని పారిశుధ్య కార్మికులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.





