ArticlesNews

రైతు ఉద్యమంలో ‘టూల్ కిట్’ ముమ్మాటికీ కుట్రే

695views

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ ఆరంభమైన రైతు ఆందోళన వెనుక అంతర్జాతీయ కుట్ర దాగుందని తెలుస్తోంది. అందులో భాగమే విస్తృత ప్రచారంలోకి వచ్చిన ‘టూల్ కిట్’ వ్యవహారం. దేశాన్ని ఆస్థిరపరిచేందుకు అనేక విద్రోహశక్తులు పనిచేస్తున్నాయి. అందులో వేర్పాటు వాద, తీవ్రవాద, ఖలిస్థాన్ అనుకూల ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ ఒకటి. వీరు విదేశాల్లో ఉంటూ పంజాబ్, హర్యానా రైతుల ఆందోళనకు అన్ని విధాలా మద్దతు ఇస్తూ ఎలా ఉద్యమించాలో, ఏ సమయంలో ఎవరిని సంప్రదించాలో మార్గ దర్శక పత్రాల్ని (టూల్ ‌కిట్) రూపొందించి ప్రచారంలో పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో గతనెల గణతంత్ర దినోత్సవం రోజు ఆందోళనకారులు సృష్టించవలసిన బీభత్సం గూర్చి ముందే ‘రోడ్ మ్యాప్’ రూపొందించారు. ఆ సందర్భంగా పోలీసులు, భద్రతా బలగాలు అతిగా స్పందించి ఆందోళనకారులపై విరుచుకుపడితే ఆ సమాచారం ఫొటోలు, వీడియోలను అంతర్జాతీయ మీడియా దృష్టికి, అంతర్జాతీయ ప్రముఖల దృష్టికి తీసుకొచ్చి భారత ప్రభుత్వ దమనకాండను ఎండగట్టాలని, ఆ రకంగా రైతు ఆందోళనకు సంఘీభావం కూడగట్టాలని, అలా ఉద్యమించి భారత ప్రతిష్టను దెబ్బతీయాలని పెద్ద కుట్రపన్నారు. ఇప్పుడది బహిర్గతమై అనేక మంది అరెస్టులకు దారితీసింది.

కుట్రలో భాగస్వాములెవరు?

ముందుగా బెంగళూరుకు చెందిన దిశారవిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయికి చెందిన న్యాయవాది నికితా జాకబ్, పూణేకు చెందిన ఇంజినీర్ శంతనుపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. మరిన్ని పేర్లు ముందుకొచ్చే అవకాశ ముంది. స్వీడన్లోని పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్ బర్గ్ సంఘీభావం పొందేందుకు, ఆమె తన మద్దతు ప్రకటించేందుకు గాను దిశరవి ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. వారి మధ్య జరిగిన ట్వీట్లు ఇప్పుడు మీడియా లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అందులోని సమాచారం ఆధారంగా తన (దిశరవి) పై దేశద్రోహం (యుఏపి ఏ) కేను పెట్టే ప్రమాదం లేకపోలేదన్న మాటకూడా ఉండటంతో వారేమి చేస్తున్నారో ఎలాంటి ‘టూల్ ‌కిట్ ను సోషల్ మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారంలో పెడుతున్నారో అర్థం వేసుకోవచ్చు. దిశరవికి ఆ అవగాహన ఉంది. అయినా ఆ ‘చర్య’కు పాల్పడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆందోళనకారులు సృష్టించిన భారీ హింస వెనుక ఉన్న రణతంత్రం, వ్యూహం, ఎత్తుగడల రూపకల్పనలో దిశరవి, నికితా జాకబ్, శంతను మరికొంత మంది పాల్గొని ఆ రోజు ఢిల్లీలోనే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎంతో గర్వంగా గంభీరంగా, ఉత్సాహంగా, జరుపుకోవలసిన గణతంత్ర దినోత్సవాన్ని ఇలా రక్తసిక్తం చేయడం దారుణం గాక ఏమవుతుంది?

 

దిశరవి, నికితా జాకబ్, శంతను

పోలీసులపైనే దాడులా? ఎంత ఘోరం?

ఏ ఆందోళన సమయంలోనైనా ఉద్యమకారులు పోలీసుల దెబ్బల కారణంగా గాయపడతారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది తిరగబడింది. ఆ రోజు ఆందోళనకారుల చేతుల్లో ఎంతో మంది పోలీసులు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆసుపత్రుల పాలయ్యారు. ఆందోళనకారులు వీరవిహారం చేసి మారణాయుధాలతో, యధేచ్చగా తిరిగారు. అడ్డం వచ్చిన వారిని గాయపరిచారు. కొందరు గుర్రాలపై స్వైరవిహారం చేశారు. ట్రాక్టర్లను మనుషులపైకి తోలారు. తొక్కించే ప్రయత్నం చేశారు. ఈ రకమైన కవ్వింపు చర్యలకు పాల్పడటమే గాక ఆ చర్యలకు స్పందించి పోలీసులు, లాఠీలకు పని కల్పిస్తే, రైతులను చెదరగొడితే, గాయపరిస్తే ఆ సమాచారం దృశ్యాల ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని ‘బద్ నామ్’ చేసేందుకు సిద్ధపడిన ‘టూల్ కిట్’ తయారు చేసిన వారిది ‘కుట్ర’ గాక ఏమవు తుంది?

ఇదేం ఉద్యమం?

జూమ్’ మాధ్యమం ద్వారా ఈ గుంపు’ తరచూ సమావేశమై నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా సమాచారం. ఆందోళన బాధ్యతలు ఎవరెవరికి అప్పగించాలో, ఎవరెవరు ఏమేమిచేయాలో, ఎంత తీవ్రంగా ఉద్యమాన్ని కొనసాగించాలో, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ముందు, అదానీ, అంబానీల కార్యాలయాల ముందు ఎలాంటి ఆందోళన జరపాలో ముందుగానే నిర్ణయించారు. ఇంత వివరణాత్మక రూపకల్పన వెనుక ఖలిస్థాన్ శక్తులున్నాయని తేటతెల్లమవుతోంది. ఇది కుట్ర స్వభావంగాక ఇంకేమవుతుంది? ఆందోళన తొలిదశలోనే పంజాబ్, హరియాణాలలో అంబానీకి చెందిన జియోటవర్లను అనేకం ధ్వంసం చేశారు. జియోమార్ట్ దుకాణాలపై దాడులు చేశారు. దగ్ధకాండకు పూనుకున్నారు. వారి వాహనాలను అగ్నికి ఆహుతి ఇచ్చారు. ఇదీ రైతుల ఆందోళన పేరుతో జరుగుతున్న ఉద్యమ స్వరూప స్వభావం.

దుష్ప్రచారమే వారి ఆయుధం

రైతుల భూములన్నింటినీ అంబానీ, అదానీ లకు కట్టబెట్టేందుకే ఈ మూడు బిల్లులు తీసుకొచ్చారనే దుష్ప్ర చారాన్ని అటు కాంగ్రెసు, ఇటు రైతు నాయకులు ఇప్పటికీ పెద్ద ఎత్తున చేస్తూండడం దారుణం. ఉద్యమ ఆరంభమే అసాంఘిక శక్తుల, కుట్రదారుల ప్రోద్బలంతో మొదలయింది. ఇంత ఆలోచనారహితంగా, ఇంత అమాయకంగా, అవగాహనారహితంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం విడ్డూరం. రైతు నాయకుడు రాకేష్ తికాయత్ కన్నీళ్లు పెట్టుకుని తాము ఎంతో నష్టపోతున్నామని చెప్పినంత మాత్రాన ఆయన సామాజికవర్గం వారు, ఖలిస్థాన్ అనుకూల శక్తులు, ప్రతిపక్షాల వారు విజ్ఞతతో ఆలోచించవలసిన అవసరం లేదా? రాజకీయ లబ్ది పొందడమే ప్రధానమా? వాస్తవం, సత్యం విలువలు ఏమీ అక్కర్లేదా?

ఈ ఉద్యమం వెనుక బలమైన హస్తం ఎవరిదో బట్టబయలైనప్పటికీ, ఆ సమాచారం అంతటా కనిపిసున్నప్పటికీ పశ్చాత్తాపం ప్రకటించక ఇంకా రైతు ఆందోళనను, ఉద్య మాన్ని విస్తృతం చేసేందుకు కొందరు కాలుకు బలపం కట్టుకుని తిరగడం విషాదకరం. చాలా కాలంగా భారత పోలీసులు గాలిస్తున్న ఫ్రెడరిక్ అనే నిందితుడు, కెనడాలోని ఖలిస్థాన్ భావజాలాన్ని విన్తృతవరిచే మొదాలీవాల్, ఇట్లా వంటి ఎందరి పేర్లో ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అనేక నిషేధిత సంస్థల, వెబ్ సైట్ల, గూడువుఠాణి సైతం బట్టబయలైంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా ఇప్పుడు భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు చిరకాలంగా పనిచేస్తున్న అంతర్జాతీయ శక్తుల, వ్యక్తుల బండారం బయటపడుతోంది. వారి చేతిలో పంజాబ్, హరియాణాలోని కొందరు రైతులు కీలుబొమ్మలుగా మారిన వైనం తేటతెల్లమైంది. రాజకీయాలకు తమ ఉద్యమం ఆమడదూరమని ఎంత బొంకినా అంతిమంగా వారి మూలాలు ఎక్కడున్నాయో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు.

కుట్రలను తిప్పికొట్టడం మనందరి బాధ్యత

కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు, ఇతర ప్రముఖులు ఎవరు చెప్పినా వినకుండా మంకు పట్టుతో చట్టాల రద్దు పేర ఉద్యమం నడిపి దేశ గౌరవానికి మచ్చ తేవాలన్న ‘బుద్ధి” విదేశాల్లోని విద్రోహక్తులదేనని చెప్పుకోవడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందుకు ‘టూల్ కిట్’ కేవలం చిన్న సాక్ష్యం, ఉదాహరణ మాత్రమే! ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమ సంస్థ ఇందుకు ఆజ్యం పోయడం విచిత్రం. ప్రముఖులతో ఒత్తిడి తీసుకు రావడం, వారి చేత ట్వీట్లు చేయించి మద్దతు కూడగట్టడం, దేశాన్ని బలహీనపరిచే విధంగా వ్యవహారాలు నడపడం ఎవరికి శ్రేయస్కరం? ఈ ఉద్యమానికి పెద్దఎత్తున నిధుల సేకరణ జరుగుతోందని కూడా తెలుస్తోంది. జూమ్’ సమావేశాల్లో 70 మందికి పైగా పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ వార్తల సహాయంతో దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. విదేశీ శక్తులతో కొందరు కుమ్మక్కై రైతులకు మద్దతు పేర ఆసత్యాలు వ్యాప్తి చేస్తున్నారు. ఓ వైపు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శక్తులు, మరోవైపు కెనడా మరియు ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్థాన్ వేర్పాటువాద శక్తులు దేశంపై పంజా విసిరేందుకు తమ శక్తినంతా కూడదీసుకుని కుట్రలు పన్నుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే తాజాగా ఉత్తరప్రదేశ్ లో రాడికల్ స్వభావంగల, ఢిల్లీలో గత సంవ త్సరం జరిగిన అల్లర్లకు ఆజ్యం పోసిన ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పిఎఫ్ఐ)కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి లక్ష్యం దేశంలో అల్లర్లు సృష్టించడమే గాక ప్రముఖులను హతమార్చడం. ఇలా ఓ పథకం ప్రకారం దుష్టశక్తులు దేశంపై ‘కుట్ర పన్నుతున్నాయి. వీటిని తిప్పికొట్టడం పౌరులందరి బాధ్యత.

– ఉప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్టు, 9985781799.

వార్త సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.