కేరళంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ విషయంలో వివాదం చెలరేగింది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో గేయం పూర్తికాకముందే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కె. మురళీధరన్‌తో పాటు పలువురు ప్రముఖులు కూర్చుండిపోవడం రాజకీయ దుమారానికి దారితీసింది. జాతీయ గేయాన్ని అవమానించారని ఆరోపిస్తూ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి, జిల్లా కలెక్టర్‌తో పాటు ఈ ఘటనలో భాగస్వాములైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటన కాసరగోడ్ జిల్లాలోని కరాడ్క పంచాయతీ పరిధిలో ఉన్న ముల్లెరియా ఫ్యామిలీ హెల్త్ సెంటర్లో జరిగింది.
గేయం పూర్తికాకముందే కూర్చున్న ప్రముఖులు
ముల్లెరియా ఫ్యామిలీ హెల్త్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ప్రయోగశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ను పూర్తిగా ఆలపించాలని పంచాయతీ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. అయితే గేయంలోని మొదటి రెండు చరణాలు పూర్తికాగానే మంత్రి కె. మురళీధరన్ తన కుర్చీలో కూర్చుండిపోయారు. ఆయనను అనుసరిస్తూ వేదికపై ఉన్న ఎంపీ రాజమోహన్ ఉన్నిత్తన్, ఎమ్మెల్యే కల్లాత్ర మహిన్, జిల్లా కలెక్టర్ శ్రీధన్య సురేశ్ కూడా కూర్చున్నారు. అయితే ఎమ్మెల్యే కె. నీలకందన్ మాత్రం గేయం పూర్తయ్యే వరకు నిలబడే ఉన్నారు. ఈ పరిణామం అక్కడున్నవారి దృష్టిని ఆకర్షించింది. అనంతరం ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది.
మంత్రి, కలెక్టర్‌పై కేసులు నమోదు చేస్తాం: బీజేపీ
ఈ ఘటనపై బీజేపీ నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ గేయం పూర్తికాకముందే ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చోవడం సముచితం కాదని విమర్శించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా వ్యవహరించడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని పేర్కొంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఎం.ఎల్. అశ్విని ఈ ఘటనను రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు. మంత్రి, జిల్లా కలెక్టర్‌తో పాటు ఇందులో భాగస్వాములైన ఇతరులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. క్యాబినెట్ మంత్రి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. జాతీయ గీతంతో సమాన ప్రాధాన్యం కలిగిన ‘వందేమాతరం’ను అవమానించినందుకు మంత్రి, ఇతర ప్రముఖులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, మంత్రికి వ్యతిరేకంగా నిరసనలను మరింత ఉధృతం చేస్తామని జిల్లా కమిటీ హెచ్చరించింది.




