News

బాబ్రీ కూల్చివేతను టీవీలో చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నా.. సోనియా గాంధీ

4views

బాబ్రీ మసీదు (Babri Masjid) కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు, ఆ దృశ్యాలను టెలివిజన్‌లో చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని సోనియా గాంధీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ అత్యంత ఘాటుగా స్పందించింది. అప్పట్లోనూ, ఇప్పుడు కూడా కాంగ్రెస్ హృదయంలో బాబర్ జీవించే ఉన్నాడని బీజేపీ ధ్వజమెత్తింది. అంతేకాకుండా, ఆ రోజుల్లో ఆ ఘటనను టీవీలో చూశానని చెప్పిన సోనియా దావాపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. తన పుస్తకం ‘బిలాంగింగ్: అ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలకు ముందు ఓ బ్రిటిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా ఈ విషయాలను పంచుకున్నారు.

1992లో టెలివిజన్లో మసీదును కూల్చివేయడం చూసి తాను ఎంతో ఆవేదనతో ఏడ్చానని, మహాత్మా గాంధీ, జవాహర్‌లాల్ నెహ్రూ కలలు కని నిర్మించిన లౌకిక భారతదేశంను కాపాడుకోవడానికి ఇకపై సుదీర్ఘమైన పోరాటం చేయక తప్పదని అప్పుడే తనకు అర్థమైందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని రాజకీయ పొరపాట్లనుకూడా ఆమె ఒప్పుకున్నారు. పార్టీలో ఉన్న అలసత్వ ధోరణి మూలంగానే బీజేపీ, దాని తీవ్ర హిందూత్వ రాజకీయాలు బలోపేతం కావడానికి అవకాశం దక్కిందని ఆమె వ్యాఖ్యానించారు.

సోనియా వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాంశు త్రివేది తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రాజకీయం మహాత్మా గాంధీ కలలు కన్న రామరాజ్యం వైపు కాకుండా, బాబర్ రాజ్యం వైపు పయనిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కేవలం సాధారణ ముస్లింలతో మాత్రమే కాకుండా, వారిలోని తీవ్రవాద మూలకాలుతో కూడా నిలబడుతోందని ఆరోపించారు. 1989లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అయోధ్య నుంచి శ్రీరాముడి పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించగా, నేడు సోనియా గాంధీ మాత్రం బాబ్రీ గురించి మాట్లాడుతున్నారని, గాజా (Gaza) సంఘటనలపై దిగులు చెందుతున్నారని, బట్లా హౌస్ ఎన్‌కౌంటర్ నిందితుల కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని త్రివేది విమర్శించారు. గాంధీకి చెందిన మూడు తరాల నాయకులు జవాహర్‌లాల్ నెహ్రూ (1959), ఇందిరా గాంధీ (1968), రాహుల్ గాంధీ (2005) పిలవకుండానే బాబర్ సమాధిని సందర్శించి అక్కడ ప్రార్థనలు చేశారని గుర్తు చేశారు.