ArticlesNews

ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ఐక్యతకు ప్రతీక కార్తిక మాసం

4views

హిందూ ధర్మంలో కార్తిక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శివకేశవుల ఆరాధనకు విశేషమైన ఈ మాసంలో నిత్య స్నానాలు, దీపారాధన, ఉపవాసాలు, వ్రతాలు, దానధర్మాలు ఆచరించడం ఎంతో పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున ఉండే మాసం కావడంతో దీనికి కార్తిక మాసం అనే పేరు వచ్చింది. ‘న కార్తిక సమో మాసః’ అంటే కార్తిక మాసానికి సమానమైన మాసం మరొకటి లేదని పెద్దలు చెబుతారు.

శివకేశవుల ఆరాధనకు విశేషమైన మాసం
దీపావళి అనంతరం వచ్చే కార్తిక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ మాసాన్ని ‘కౌముది మాసం’ అని కూడా పిలుస్తారు. కౌముది అంటే వెన్నెల. శరదృతువులో వెన్నెల కాంతులతో ప్రకృతి ఆహ్లాదకరంగా కనిపించే ఈ కాలం భగవదారాధనకు అనువైనదిగా భావిస్తారు.కార్తిక మాసం శైవ, వైష్ణవ సంప్రదాయాలకు సమాన ప్రాధాన్యత కలిగినది. శివారాధన, విష్ణు పూజ, తులసీ పూజ, దీపారాధన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తులు విశేషంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానాలు ఆచరించడం వల్ల కాయక, వాచిక, మానసిక దోషాలు తొలగిపోతాయని పురాణ విశ్వాసం.

కార్తిక మాసంలో నక్త వ్రతం.. సోమవార దీక్ష ప్రత్యేకత
కార్తిక మాసంలో ఆచరించే వ్రతాలలో నక్త వ్రతానికి ప్రత్యేక స్థానం ఉంది. పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేయడాన్ని నక్త వ్రతం అంటారు. పద్మ పురాణం, స్కాంద పురాణం వంటి గ్రంథాల్లో ఈ వ్రత ప్రాశస్త్యం వివరించబడింది.

అలాగే కార్తిక సోమవారాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల్లో భక్తులు ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శిస్తారు. శివలింగానికి అభిషేకాలు, బిల్వదళాలతో అర్చనలు నిర్వహిస్తారు. ఉసిరి చెట్టు కార్తిక మాసంలో ప్రత్యేక పూజలను అందుకుంటుంది. ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం, ప్రదక్షిణలు చేయడం, ఆ చెట్టు నీడలో భోజనం చేయడం శుభప్రదమని పౌరాణిక సంప్రదాయాలు చెబుతున్నాయి.

కార్తిక మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు
1. యమ ద్వితీయ
కార్తిక శుద్ధ విదియను యమ ద్వితీయగా పిలుస్తారు. ఈ రోజున సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేయడం విశేషంగా భావిస్తారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.

2. నాగుల చవితి
కార్తిక శుద్ధ చవితి నాగుల చవితి. ఈ రోజున నాగదేవతలను పూజించడం ఆనవాయితీ. నాగపుట్టల వద్ద పూజలు నిర్వహించి కుటుంబ క్షేమం, సంతాన సౌభాగ్యం కోసం భక్తులు ప్రార్థిస్తారు. నాగవ్రత ప్రాశస్త్యాన్ని చతుర్వర్గ చింతామణి వంటి వ్రత గ్రంథాలు వివరిస్తాయి.

3. కార్తిక శుద్ధ ఏకాదశి – ప్రబోధినీ ఏకాదశి
కార్తిక శుద్ధ ఏకాదశిని ప్రబోధినీ ఏకాదశి లేదా ఉత్తాన ఏకాదశి అంటారు. చాతుర్మాస్య వ్రతానికి ఈ రోజుతో ముగింపు పలుకుతారు. శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే పవిత్ర దినంగా దీనిని వైష్ణవ సంప్రదాయం భావిస్తుంది.

4. క్షీరాబ్ధి ద్వాదశి – తులసి వివాహం
ఏకాదశి మరుసటి రోజు కార్తిక శుద్ధ ద్వాదశి. దీనిని క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి, బ్రహ్మ తదితర దేవతలతో కలిసి తులసి బృందావనానికి విచ్చేస్తాడని పురాణ గాథలు చెబుతున్నాయి.ఈ సందర్భంగా తులసి మొక్కకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తులసి వివాహాన్ని కూడా వైభవంగా జరుపుకుంటారు.

కార్తిక దీపారాధన.. దీపదానానికి విశేష ప్రాధాన్యత
కార్తిక మాసం అంటేనే దీపాల మాసం. ఈ నెలలో ఇంటి ముందు, తులసి కోట వద్ద, దేవాలయాల్లో దీపాలు వెలిగించడం పవిత్రమైన ఆచారంగా కొనసాగుతోంది.

ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన చేయడం, ఆలయాల్లో దీపాలు సమర్పించడం, దీపదానం చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. దీపం అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే ప్రతీకగా భావిస్తారు.

కార్తిక పౌర్ణమి – త్రిపురాసుర సంహారానికి ప్రతీక
కార్తిక మాసంలోని అత్యంత విశిష్టమైన పర్వదినాల్లో కార్తిక పౌర్ణమి ఒకటి. దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు.పురాణాల ప్రకారం, త్రిపురాసురులను సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించిన పరమశివుని విజయానికి గుర్తుగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ రోజున సాయంత్రం శివాలయాల్లో దీపాలు వెలిగించడం, దీపారాధన చేయడం విశేషం.

జ్వాలాతోరణం.. శివపార్వతుల దివ్యగాథ
కార్తిక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే మరో ప్రత్యేకమైన ఉత్సవం జ్వాలాతోరణం.పురాణ గాథల ప్రకారం, క్షీరసాగర మథనం సమయంలో హాలాహల విషం ఉద్భవించింది. లోకాలను రక్షించేందుకు పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలిపాడు. దీంతో ఆందోళన చెందిన పార్వతీదేవి, శివుడు ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడితే కుటుంబ సమేతంగా చిచ్చుల తోరణం కింద మూడుసార్లు దాటుతానని మొక్కుకుందని కథనం. ఈ సంప్రదాయమే జ్వాలాతోరణ ఉత్సవంగా కొనసాగుతోందని పురాణ కథలు వివరిస్తాయి.

ఈ సందర్భంగా శివాలయాల్లో ఎండు గడ్డితో తోరణాన్ని ఏర్పాటు చేసి నిప్పంటిస్తారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి మండుతున్న జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు తీసుకెళ్తారు. ఈ ఉత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకిస్తారు.

వనభోజనాలు.. ప్రకృతితో మమేకమయ్యే సంప్రదాయం
కార్తిక మాసంలో వనభోజనాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉసిరి చెట్ల వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి వనభోజనాలు నిర్వహిస్తారు.ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేయడం, చెట్టు నీడలో భోజనం చేయడం ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా కొనసాగుతోంది. ఈ వనభోజనాలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒకచోట చేరి ఆనందంగా గడిపేందుకు కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తాయి.

తెల్లవారుజామున పవిత్ర స్నానాలు, రోజంతా ఉపవాసాలు, సాయంత్రం దీపారాధనలు, శివకేశవుల పూజలు, దీపదానాలు, వనభోజనాలు.. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల సమాహారమే కార్తిక మాసం.
ఈ మాసం భక్తులకు భగవంతుడిని స్మరించుకునే అవకాశాన్ని కల్పించడమే కాకుండా, కుటుంబ బంధాలను బలోపేతం చేసే సంప్రదాయాలను కూడా అందిస్తోంది.చీకటిని తొలగించే దీపంలా మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని, భక్తిని, సత్ప్రవర్తనను పెంపొందించుకోవాలని కార్తిక మాసం సందేశం ఇస్తోంది.