ArticlesNews

చికాగో నుంచి న్యూయార్క్‌ దాకా: సనాతన ధర్మ విశ్వనాదం

16views

మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌ అధినేత మోహన్ భాగవత్ సందేశం – ఒక తాత్విక విశ్లేషణ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ ల పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఆయన పర్యటనను అడ్డుకోవటానికి కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.ఆయన అమెరికాలో అడుగుపెడితే అక్కడ మతసామరస్యం దెబ్బతింటుందని, మత ఘర్షణలు చెలరేగుతాయని భారతీయ మూలాలు ఉన్న న్యూయార్క్ మేయర్ ఆయనని స్వాగతించడానికి బదులు ఆయన పర్యటనను అడ్డుకోవటానికి ప్రయత్నం చేశాడు.

న్యూయార్క్ లో ఆగస్టు 29న జరిగిన “యూనివర్సల్ వన్ నెస్ సెలబ్రేషన్స్” లో మోహన్ భగవత్ చేసిన ప్రసంగం ఒక స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి అందించింది. 133 సంవత్సరాల క్రితం చికాగో లో స్వామి వివేకానంద విశ్వమత మహాసభలో చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసింది. మోహన్ భగవత్ హిందూ ధర్మం యొక్క విశిష్టత గురించి చెబుతూ హిందూ చింతనలో అధిపత్య ధోరణిలేదని, ఇతర సమాజలపై విజయాన్ని కోరుకోదని, అది సకల సృష్టిలోని అంతర్లీన ఏకత్వాన్ని గుర్తించే ప్రపంచాన్ని కాంక్షిస్తుందని అన్నారు. వివేకానందుడు చికాగోలో చేసిన ప్రసంగం నాటి చారిత్రిక పరిస్థితులు వర్తమాన పరిస్థితులతో పోల్చలేము. ఆ రోజు భారతదేశం వలస పాలనలో మ్రగ్గుతున్నది. తీవ్రమైన ఆత్మవిస్మృతి లో భరతజాతి ఉంది. ఈనాడు భారతజాతి కుండలినీ శక్తి మేలుకొంది. ఎదుగుతున్న భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి అంతర్జాతీయంగా అనేక శక్తులు పనిచేస్తూ భారత నాయకత్వం మీద దుష్ప్రచారం చేస్తున్న తరుణంలో మోహన్ భాగవత్ అమెరికాలో కాలు పెట్టారు.

స్వామి వివేకానంద అమెరికాలో వెలువరించిన సందేశానికి తాత్విక కొనసాగి౦పుగానే మోహన్ భాగవత్ ప్రసంగం సాగింది. భిన్నత్వం విభజనకు దారితీయదన్న ప్రాచీన భారతీయ అనాదివిశ్వాసం, నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం మానవ సౌభాతృత్వానికి దారితీగలదన్న నమ్మకమే ఆ ఇద్దరి సందేశాలలో మనకు కనిపించేది. మోహన్ భాగవత్ గారు అమెరికాకు, భారత్ కు మధ్య ఉన్న ఒక ప్రధాన వ్యత్యాసం గురించి కూడా చెప్పారు. అమెరికా “బహుత్వం” ప్రాధాన్యత గురించి చెబుతుంటే, “భిన్నత్వంలో ఏకత్వం” గురించి మాట్లాడుతుందని, భిన్నత్వం, ఏకత్వం భారత సమాజపు డి.ఎన్.ఏ.లో అంతర్భాగమని పేర్కొన్నారు. అందువలననే భారతీయులకు పరమత సహనం ఎక్కువని, ఏ సమాజం లోనైనా ఒదిగిపోగలరని అన్నారు. భిన్నత్వాన్ని బలవంతగా అంగీకరించవలసిన అంశం కాదని, భిన్నత్వంలోనే అందం, ఆనందం ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని సందర్శించటమే భారతీయుల లక్ష్యమని , దానిని అంగీకరించి, గౌరవించటం నేర్చుకోవాలని ఆయన అన్నారు. అమెరికన్ల మెప్పుకోసం చేసిన రాజకీయ ప్రకటన కాదిది. సనాతన ధర్మం యొక్క తాత్విక పునాదే ఇది. విశ్వంలోని సమస్త చరాచర సృష్టికి మూలం ఒకటేనని, వైవిధ్యం సహజ లక్షణమని, అస్తిత్వ ఐక్యత అంతిమ సత్యమని ఆయన పేర్కొన్నారు. తమ సహనాన్ని ప్రదర్శించడానికి హిందువులు తమ గుర్తింపు వదులుకోవాలని ఆయన కోరలేదు. జీవితంలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని హిందూ నాగరికత అర్థం చేసుకున్నందువల్లే బహుత్వాన్ని ధైర్యంగా, మనస్ఫూర్తిగా ఆదరించే లక్షణం భారతీయులకు తరతరాలుగా అలవడిందని ఆయన పేర్కొన్నారు. “వైవిధ్యం సహజం, ఏకత్వమే సత్యం” అనే ఆయన సూత్రీకరణ, అపారమైన భారతీయ తాత్విక జ్ఞానాన్ని కొన్ని మాటల్లో అందంగా సంగ్రహించింది.

సనాతన ధర్మ విశ్వజనీనత, హిందువులు తమ హిందుత్వాన్ని తగ్గించుకోవాలని కోరదు. దాని సౌభ్రాతృత్వ భావన, దాని స్వంత నాగరిక ప్రపంచ దృష్టికోణం నుండే ఉద్భవిస్తుంది. ధర్మం గురించి ఆయన నిర్వచనం కూడా అంతే ముఖ్యమైనది. ధర్మం అనేది, విశ్వం మనుగడకు మరియు మానవులు తమ జీవన నాణ్యతను సరిగ్గా నిర్వహించుకోవడానికి ఉపయోగపడే ఒక సూత్రం అని ఆయన అన్నారు. సమతుల్యమైన “మధ్యేమార్గాన్ని” ఆయన ధర్మంగా అభివర్ణించారు. ఇది చర్చను గుర్తింపు రాజకీయాల నుండి నాగరిక బాధ్యత వైపుకు మరలుస్తుంది.

దురభిప్రాయాలు కలిగిన వారి మనస్సుల నుండి శత్రుత్వం తొలగిపోవాలని కూడా భారతీయ సాధువులు ప్రార్థిస్తారని మోహన్‌ భాగవత్ తన శ్రోతలకు గుర్తు చేశారు. ఇది బలహీనత కాదు. ఇది తన సమాజ సరిహద్దులకు ఆవల సంక్షేమాన్ని కోరుకునేంతగా తనలో తాను సురక్షితంగా ఉన్న నాగరికతను సూచిస్తుంది. బహుశా ఆ ప్రసంగంలోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి ప్రత్యేకంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి చెప్పబడింది. తమ కర్మభూమి పట్ల విధేయతతో ఉండాలని మోహన్‌ భాగవత్ వారికి ఉద్బోధించారు. ఆ బాధ్యతను నెరవేర్చిన తర్వాతే, తమ జన్మభూమికి సేవ చేయాలనే వారి కోరిక వ్యక్తమవ్వాలని, అలా చేయడానికి ఉత్తమ మార్గం భారతదేశం వారికి అందించిన విలువలతో జీవించడమేనని ఆయన అన్నారు.

ప్రవాస భారతీయ సమాజం అమెరికన్ సమాజం నుండి వేరుగా ఉండమని చేసిన పిలుపు అది కాదు. నాగరికతను మరచిపోకుండా ఏకీకృతం కావాలన్న విజ్ఞప్తి అది: మీరు ఏ నాగరికత నుండి వచ్చారో ఆ నాగరికత విలువలను విశ్వాసంతో పాటిస్తూ, మీరు నివసిస్తున్న దేశానికి బాధ్యతగల పౌరులుగా ఉండండి.

ప్రతి దేశానికి “అందించడానికి ఒక సందేశం, సాధించడానికి ఒక కర్తవ్యం, నెరవేర్చడానికి ఒక గమ్యం” ఉంటుందన్న స్వామి వివేకానంద బోధనను మోహన్‌ భాగవత్ ఉటంకించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని గ్రహించడం, ఆ విషయాన్ని ప్రపంచం గ్రహించేలా పదేపదే సహాయపడటమే భారత్ యొక్క గమ్యం అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాజాలు మతపరమైన సంఘర్షణలు, జాతి ఉద్రిక్తతలు, సైద్ధాంతిక ధ్రువీకరణ, ఒంటరితనం, వినిమయవాదం, పోటీపడే నిరంకుశత్వాలతో సతమతమవుతున్న తరుణంలో, మానవత్వం తనలోని అంతర్లీన ఐక్య తను గుర్తిస్తూనే భేదాలను కూడా గౌరవించగలదనే ప్రతిపాదన ఎప్పటికీ నిత్యనూతనమే.

వలస పాలకులు తమపై రుద్దిన భావనా చట్రం నుండి హిందువులు బయటపడి తమ అస్తిత్వ మూలాల గురించి ఆలోచించి, వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం మొదలైనప్పుడల్లా ఇది విశ్వజనీన భావనలకు పెద్ద ముప్పుగా అభివర్ణించేవారు ఉన్నారు. హిందువులు ఈ రెండిటిమధ్య (హిందుత్వం,విశ్వజనీనత్వం) దేన్నో ఒక దాన్ని ఎంచుకోవాలని చెప్పేవారున్నారు. హిందువులు బహుత్వవాదులు కనుక, వైవిధ్యాన్ని గౌరవించి అంగీకరించే వారు కనుక హిందువులు హిందువులుగా మనగలిగితే చాలని భాగవత్ అంటున్నారు. విశ్వసౌభాతృత్వ భావన దాని సొంత నాగరిక ప్రపంచ దృష్టికోణం నుండే వస్తుంది. ఆధిపత్యం కాదు. మతమార్పిడి కాదు. సాంస్కృతిక ఏకరూపత కాదు. ధర్మానికి అనుగుణంగా జీవించడమే మన కర్తవ్యం అని ఆయన బోధించారు. “ఎవరైనా, తన ఆరాధనా విధానాన్ని మార్చుకున్నంత మాత్రాన అతడిని పరాయివాడుగా పిలిచేటంత సంకుచిత మనస్కులం కాదు మనం. భగవంతుడిని ఎవరు ఏ పేరుతో పిలిచినా, మాకు అభ్యంతరం లేదు. సంఘం లోని మేము అణువణువునా హిందువులం కనుకనే అన్ని మత విశ్వాసాలను సమానంగా గౌరవిస్తాం. మతం విషయంలో అసహనం కలిగిన వ్యక్తి ఎవరైనా హిందువు అనిపించు కొనడానికి అర్హుడేకాదు”అన్న గురూజీ గోల్వల్కర్ మాటలను ఆయన పునరుద్ఘాటించారు.

1893 లో చికాగోలో స్వామి వివేకానంద అసాధారణమైన ఆత్మవిశ్వాసంతో ఆధునిక పాశ్చాత్య ప్రపంచం ముందు హిందూ ధార్మిక చింతనను పరిచయం చేశారు. 2026లో మోహన్‌ భాగవత్ న్యూయార్క్‌ వేదికపై నుండి, పూర్తిగా భిన్నమైన చారిత్రక పరిస్థితులలో మాట్లాడారు. కానీ ఒక ప్రాచీన నాగరికతా విశ్వాసం ఇప్పటికీ వినిపించింది: మానవాళి ఒక్కటే; వైవిధ్యం ఆ ఏకత్వాన్ని సుసంపన్నం చేస్తుంది; ధర్మం విభజించకుండా నిలబెడుతుంది; హిందూ చైతన్యం యొక్క అత్యున్నత వ్యక్తీకరణ కేవలం హిందువుల సంక్షేమం మాత్రమే కాదు, అందరి సంక్షేమం. వివేకానందుని చికాగో ప్రసంగం తర్వాత 133 సంవత్సరాలు గడిచినా, మానవాళికి సనాతన ధర్మం చేసిన ప్రతిపాదన అద్భుతంగా సందర్భోచితంగానే ఉంది. ప్రపంచం ఏకరూపంగా మారాలని కాదు, మనం ఒకరికొకరం చెందినవారమనే విషయాన్ని మరచిపోకుండా వైవిధ్యంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి.

“మనం సమాజానికి మంచిని తిరిగి ఇవ్వాలి. అదే మన పరంపర,” అని ఆయన అన్నారు. భారతీయ జీవన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లదగిన ఒక సుస్థిర నమూనాగా తన ప్రసంగం ద్వారా నేటి సమాజానికి ఆయన మరల ఆవిష్కరించారు. అంతిమంగా, ఆ ఆచరణాత్మక సందేశమే ఈ ప్రసంగాన్ని ప్రపంచ వేదికపై ఒక చారిత్రక మైలురాయిగా మార్చింది. భారతదేశాన్ని ‘హిందూ పాకిస్తాన్’ చేయడానికి ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించిన వారికి ఆయన ప్రసంగం కనువిప్పు కలిగిస్తుంది.

– డా|| బొమ్మరాజు సారంగపాణి