
సేంద్రియ వ్యవసాయంలో లద్దాఖ్ సరికొత్త ఘనత సాధించింది. దేశంలోనే తొలి 100 శాతం సేంద్రియ కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ప్రకటించారు. రసాయన ఎరువుల వినియోగానికి స్వస్తి పలుకుతూ.. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల ద్వారా పర్యావరణహిత సాగును ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లద్దాఖ్‌లో వ్యవసాయ రంగంలో రసాయన, సింథటిక్ ఎరువుల విక్రయాలు, వినియోగాన్ని గత జులై నుంచి పూర్తిగా నిషేధించినట్లు సమాచారం. రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన కల్పించడంతో పాటు, పంటలు వేసే కాలానికి ముందే వివిధ గ్రామాల్లోని రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. ఈ చర్యలతో లద్దాఖ్ సేంద్రియ వ్యవసాయంలో కీలక ముందడుగు వేసింది.
దేశానికి గర్వకారణం: ఎల్జీ వి.కె. సక్సేనా
లద్దాఖ్‌ను 100 శాతం సేంద్రియ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ఆ ప్రాంతంతో పాటు దేశానికి గర్వకారణమని లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లోనూ పర్యావరణహిత వ్యవసాయం విజయవంతం చేయవచ్చని అక్కడి రైతులు నిరూపించారని తెలిపారు. సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కాపాడటం, స్థానిక రైతులకు మెరుగైన జీవనోపాధి కల్పించడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యాలని ఆయన వివరించారు.
ఆప్రికాట్లు, బార్లీ.. లద్దాఖ్ ప్రత్యేక పంటలు
లద్దాఖ్ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు వివిధ పంటలను సాగు చేస్తుంటారు. ఆప్రికాట్లు, హిమాలయన్ బెర్రీ, కుట్టు గోధుమ, బార్లీ వంటి పంటలు ఇక్కడ ప్రధానంగా పండిస్తారు. సేంద్రియ వ్యవసాయ విధానాల ద్వారా ఈ పంటలను సాగు చేయడం వల్ల సంప్రదాయ వ్యవసాయానికి ప్రోత్సాహం లభించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణకు సేంద్రియ సాగు
సేంద్రియ వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడం, స్థానిక వ్యవసాయ సంప్రదాయాలను పరిరక్షించడం, రైతులకు స్థిరమైన ఆదాయ మార్గాలను ప్రోత్సహించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. హిమాలయ పర్యావరణ వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న లద్దాఖ్‌లో ఈ విధానాన్ని అమలు చేయడం ఆసక్తికర పరిణామంగా నిలిచింది.





