News

అయోధ్య రామమందిర దర్శన వేళల్లో మార్పులు.. నవంబర్ 1 నుంచి కొత్త సమయాలు

3views

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వెళ్లే భక్తులకు కీలక అప్డేట్. సీజన్ మార్పు నేపథ్యంలో రామమందిర దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి కొత్త సమయాలు అమల్లోకి రానున్నాయి. ఉదయం ఆలయం తెరిచే సమయంతో పాటు రాత్రి మూసివేసే వేళల్లోనూ మార్పులు ఉండనున్నాయి.

ప్రస్తుతం అయోధ్య రామమందిరాన్ని తెల్లవారుజామున 3:45 గంటలకు తెరిచి, రాత్రి 10:30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 4 గంటలకు ఆలయం తెరవనున్నారు. రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మార్పులు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రస్టు వెల్లడించినట్లు సమాచారం.

అయోధ్య రామమందిరం కొత్త దర్శన సమయాలు ఇవే
కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి నిర్వహిస్తారు. అనంతరం అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల కోసం ఉదయం 6:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంటాయి. ఆ తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 8:10 గంటల వరకు బాలభోగ్ సమర్పణ కోసం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేస్తారు. అనంతరం ఉదయం 11:30 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి.

మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భోగ్ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:30 గంటల వరకు విశ్రాంతి సమయం ఉంటుంది. మధ్యాహ్నం 1:35 గంటల నుంచి తిరిగి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.

సాయంత్రం సంధ్యా హారతి
సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయ ద్వారాలను 15 నిమిషాల పాటు మూసివేసి, హారతి అనంతరం తిరిగి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 10 గంటలకు ఆలయం మూసివేయనున్నారు.