News

ఆస్తిని ‘వక్ఫ్’ అని పిలిచినంత మాత్రాన అది ప్రభుత్వానిది కాదు : మద్రాస్ హైకోర్టు

25views

ఆస్తుల క్లెయిమ్‌లకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఏదైనా ఒక ఆస్తిని కేవలం ‘వక్ఫ్’ లేదా ‘మసీదు’ అని పిలిచినంత మాత్రాన లేదా డాక్యుమెంట్లలో ఆ పదాలను వాడినంత మాత్రాన అది వక్ఫ్ బోర్డుకు చెందదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడు వక్ఫ్ బోర్డు గతంలో ఇచ్చిన ఒక ఉత్తర్వును కొట్టివేస్తూ జస్టిస్ పి.బి. బాలాజీ ఈ తీర్పును ఇచ్చారు.

విల్లుపురం జిల్లాలోని సిరువడి గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ కుటుంబ ట్రస్ట్ ఆస్తిని 2009లో తమిళనాడు వక్ఫ్ బోర్డు ‘వక్ఫ్ ఆస్తి’గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని సవాలు చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయించారు. సదరు ఆస్తి కేవలం కుటుంబ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ‘వక్ఫ్-అలల్-ఔలాద్’ (ప్రైవేట్ వక్ఫ్) అని, అది బహిరంగ వక్ఫ్ కాదని పిటిషనర్లు వాదించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు, వక్ఫ్ బోర్డు మరియు వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన పాత ఉత్తర్వులను తప్పుబట్టింది.

ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. ఒక ఆస్తి వక్ఫ్ బోర్డు పరిధిలోకి రావాలంటే, ఆ ఆస్తి యజమాని దానిని మతపరమైన లేదా ధార్మిక కార్యకలాపాల కోసం ‘అంకితం’ చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలి అని కోర్టు చెప్పింది..ఆస్తిని దేవుడికి అంకితం చేయడంతో పాటు, యజమాని ఆ ఆస్తిపై తనకు ఉన్న అన్ని హక్కులను పూర్తిగా వదులుకోవాలి. అప్పుడే అది పబ్లిక్ వక్ఫ్ అవుతుంది అని పేర్కొటూ… కేవలం డాక్యుమెంట్లలో ‘మసీదు’ లేదా ‘వక్ఫ్’ అనే పదాలు ఉన్నంత మాత్రాన ఆ ఆస్తి స్వభావం మారిపోదని, అది క్లెయిమ్ చేయడానికి సరిపోదని కోర్టు తేల్చి చెప్పింది.

ఈ తీర్పుతో వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ప్రైవేట్ ఆస్తులను తమ పరిధిలోకి తీసుకునే చర్యలపై పరిమితులు ఏర్పడ్డాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల విషయంలో వక్ఫ్ బోర్డులు జోక్యం చేసుకోవాలంటే పక్కా ఆధారాలు ఉండాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.