News

మధ్యప్రదేశ్‌లోని గరౌలి గ్రామంలో 200 ఏళ్లుగా ‘తాటకి వధ’ వేడుకలు

41views

విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి పదేపదే అడ్డుతగులుతున్న తాటకి అనే రాక్షసిని ఒకే ఒక్క బాణంతో భగవాన్ శ్రీరాముడు అంతం చేశారు. ఆ ఘట్టాన్ని, రామబాణం శక్తిని గుర్తు చేసుకుంటూ గత 200 ఏళ్లుగా ఓ గ్రామంలో ఏటా వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వసంత రుతువు పంటకోత సీజన్‌(మార్చి – ఏప్రిల్)లో జరిగే ఈ వేడుకల్లో 18 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. తాటకిని వధించేందుకు ఏకంగా గుర్రాలు, ఏనుగులపై దూసుకొస్తున్నారు. తొలినాళ్లలో ఈ వేడుకలు నెల రోజులు జరిగేవి. ఇప్పుడీ ఉత్సవాలను 3 రోజులే నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఎక్కడ? 18 గ్రామాల ప్రజలు ఈ వేడుకల్లో ఎందుకు పాల్గొంటున్నారు? ఈ ఉత్సవాల్లో తాటకి వధ ఎలా జరుగుతుంది? ఈ కథనంలో తెలుసుకుందాం.

తాటకి వధ ఉత్సవాలు ఇలా మొదలయ్యాయి?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లా కేంద్రం నుంచి 34 కిలోమీటర్ల దూరంలో గరౌలి గ్రామం ఉంది. బ్రిటీష్ పాలనా కాలంలో ఇదొక రాచరిక సంస్థానంగా ఉండేది. 19వ శతాబ్దంలో దీని తొలి పాలకుడిగా దివాన్ బహదూర్ గోపాల్ సింగ్ జుదేవ్ బాధ్యతలు చేపట్టారు. గరౌలి సంస్థానం పరిధిలో 18 గ్రామాలు ఉండేవి. వాటి పేర్లు పుత్రయ, పచ్వారా, కుల్బారా, అకార్టోల్, గంజ్ కరారా, రాణిపుర, భడియాపుర గరౌలి, సలక్, వాంచోర్, భటేరా, అమన్‌పుర, రిచారా, సిలార్‌పూర్, సటోరా, పడ్రియా, కనేరా, నౌగావ్, కిరత్‌పుర. అప్పట్లో ఈ అన్ని గ్రామాల్లో భూస్వాములు ఉండేవారు. వీళ్లు ఏటా పంటకోత సీజన్‌ (మార్చి – ఏప్రిల్)లో స్థానిక రైతుల నుంచి పన్నులను వసూలు చేసేవారు. ఈ పన్నులను దివాన్ బహదూర్ గోపాల్ సింగ్ జుదేవ్‌కు చెల్లించేందుకు 18 గ్రామాల భూస్వాములు గరౌలి గ్రామానికి వచ్చేవారు. ఈ భూస్వాములను ఆనందింపజేసేందుకు దివాన్ బహదూర్ గోపాల్ సింగ్ జుదేవ్‌ తాటకి వధ ఉత్సవాలను ప్రారంభించారు. అప్పట్లో నెల రోజుల పాటు ఈ వేడుకలు జరిగేవి. భూస్వాములతో పాటు రైతులు కూడా పెద్దసంఖ్యలో ఈ ఉత్సవాలను చూసేందుకు వచ్చేవారు. తాటకిని వధించే భూస్వాములకు దివాన్ బహదూర్ గోపాల్ సింగ్ జుదేవ్‌ బహుమతులు ఇచ్చేవారు.

Elephant And Horse Tadka Vadh

నాటి నుంచి నేటి దాకా
చరిత్రకారుడు శంకర్ లాల్ సోని కథనం ప్రకారం, నాటి నుంచి నేటిదాకా గరౌలి గ్రామంలో ఏటా తాటకి వధ ఉత్సవాలు జరుగుతున్నాయి. పంట చేతికొచ్చిన వేళ 18 గ్రామాల రైతులు ఆనందోత్సాహాలతో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. పాత సంప్రదాయాల ప్రకారం తలపాగా, గంచా, కండువాలను ధరించి గుర్రాలు, ఏనుగులపై కూర్చొని మరీ భారీ తాటకి ప్రతిమను వెంటాడి వేటాడి వధిస్తున్నారు. తాటకిని వధించే వారికి బహుమతిని ప్రదానం చేస్తున్నారు. అనంతరం శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతామాత శకటాలను ప్రదర్శనగా తాటకి వధ జరిగిన ప్రదేశానికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. బ్యాండ్, డీజే, పోలీసు భద్రత నడుమ ఈ ఉత్సవాలు జరుగుతాయి.

Elephant And Horse Tadka Vadh

బందోబస్తు నడుమ వేడుకలు
ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొంటారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. అందుకే మేం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తాం. ఏటా ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి’ అని నౌగావ్ ఎస్‌‌డీఓపీ అమిత్ మెష్రామ్ తెలిపారు.

ఎవరీ తాటకి?
రామాయణంలోని బాలకాండలో తాటకి వధ అనేది ఒక ప్రధాన ఘట్టం. ఆమె సుకేతుని కుమార్తె. మారీచుడి తల్లి. సుందుడు అనే రాక్షసుడి భార్య. తాటకిని అగస్త్య మహర్షి నరమాంస భక్షక రాక్షసిగా మారమని శపించారు. ఈ రాక్షసిని శ్రీరాముడు సంహరించడం మహర్షులకు ధైర్యాన్ని ఇచ్చింది.