
వ్యవసాయ వ్యర్థాల నుంచి రోడ్లు వేసేందుకు ఉపయోగించే బయో- బిటుమిన్ దేశీయంగా అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. తారుకు బదులుగా బయో బిటుమిన్‌ను ఉపయోగించేలా రూపొందించారు. ఫలితంగా వ్యవసాయ వ్యర్థాలతో బయో-బిటుమిన్ ఉత్పత్తి ద్వారా పంట దహనం కాలుష్యాన్ని తగ్గించవచ్చని, రైతులకు ఆర్థిక మద్దతుతో పాటు గ్రామాల్లో జీవనోపాధి సృష్టిస్తుందన్నారు. ఇంకా రైతులు తమ పొలాలను త్వరగా చదును చేసుకోవడంలో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాలుకు ఇది పరిష్కారంగా మారిందని తెలిపారు. కర్బన ఉద్గారాలు, మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్)- కేంద్ర రహదారి పరిశోధన సంస్థ (సీఆర్‌ఆర్‌ఐ) పని చేస్తున్నాయి.
ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఉత్తర భారతదేశాన్ని నిరంతరం వేధిస్తున్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని కూడా ఇది పరిష్కరిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తదుపరి పంటకు భూమిని సిద్ధం చేసేందుకు చాలా మంది రైతులను పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో పాటు ఇతర పంట అవశేషాలను రోడ్ల నిర్మాణం కోసం ఉపయోగించే బయో-బిటుమెన్‌గా మారుస్తున్నారు. ఒకప్పుడు పర్యావరణానికి హానికరంగా ఉండగా, ఇప్పుడు విలువైన వనరుగా మారుతోందని అంటున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం తగ్గడంతో పాటు సుస్థిర పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను ప్రోత్సహిస్తుందన్నారు. ఇంకా రైతులకు అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కూడా అందిస్తోందని చెప్పారు.
ఇకపై రైతులు తమ పొలంలో మిగిలిపోయిన పంట వ్యర్థాలను తగలబెట్టడానికి బదులుగా పరిశ్రమలకు సరఫరా చేయవచ్చని సూచిస్తున్నారు. అక్కడ వాటిని సాంప్రదాయ రోడ్డు నిర్మాణ సామగ్రి కోసం ప్రాసెస్ చేస్తారని తెలిపారు. ఇలా రోడ్ల నిర్మాణానికి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఏటా సుమారు 60 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీనిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించడం వల్ల వాయు కాలుష్య సమస్యను కూడా పరిష్కరించవచ్చని అంటున్నారు.
దీనిని అమలు చేస్తే మూడు రకాల ప్రభావాలు ఉంటాయి
బయో-బిటుమిన్ సాంకేతికత వ్యవసాయాన్ని మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలతో అనుసంధానించే ఒక చారిత్రక అడుగు అని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. “వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది (బయో-బిటుమిన్) ఒక ఆశాజనకమైన మార్గాన్ని అందిస్తుంది. ఇది వ్యవసాయ వ్యర్థాలను అమ్ముడుపోయే వస్తువుగా మార్చి రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది.” అని చెప్పారు. సోమవారం దిల్లీలో ఏర్పాటు చేసిన “లిగ్నోసెల్యులోసిక్ బయోమాస్ నుంచి బయో-బిటుమిన్ , వ్యవసాయ వ్యర్థాల నుంచి రోడ్ల వరకు” అనే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నిర్వహించింది.
అటు భారీస్థాయి పారిశ్రామిక వినియోగం కోసం సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CRRI), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (CSIR-IIP) మధ్య సాంకేతిక బదిలీ చేసుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ సాంకేతికత సంప్రదాయ బిటుమెన్‌కు సమానమైన పనితీరును కనబరిచిందని శాస్త్రవేత్తలు తెలిపారు. రహదారి నిర్మాణంలో నాణ్యత, మన్నికకు ఎటువంటి రాజీ పడకుండా చూస్తుందని చెప్పారు. అదే సమయంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించిందన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి గణనీయమైన పర్యావరణ ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. అటు ఆర్థికంగా వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించి రైతులకు, పరిశ్రమలకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు. ఈ సాంకేతికతను రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (MoRTH) వినియోగించనుంది.
ఇది వ్యర్థాల నుంచి సంపద అనే సూత్రం పట్ల భారత నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. స్వచ్ఛ ఇంధన పరివర్తనతో పాటు బలమైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల మద్దతును చూపిస్తుందన్నారు. వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పలు రంగాల సమర్థవంతమైన సమన్వయాన్ని ఈ సాంకేతికత ప్రదర్శిస్తుందన్నారు.
బయో-బిటుమిన్ ఎందుకు ఉపయోగపడుతుంది?
సంప్రదాయ బిటుమెన్‌ను ఇది 30 శాతం వరకు భర్తీ చేస్తుంది. ఇంకా దిగుమతి చేసుకున్న పెట్రోలియం ఆధారిత బిటుమెన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. పంట వ్యర్థాలను కాల్చడం ఫలితంగా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛ భారత్ మిషన్ 2.0కి మద్దతు ఇస్తుంది. రైతులకు ఆదాయాన్ని అందించి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. ఇది రైతులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. బిటుమిన్ దిగుమతి వ్యయాన్ని తగ్గిస్తుంది. భారతదేశ డీకార్బనైజేషన్, నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడుతుంది. పంట వ్యర్థాలను పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయో-ఆయిల్‌గా మారుస్తారని CSIR వెల్లడించింది. ఈ బయో-ఆయిల్‌ను ప్రాసెస్ చేసి, సాధారణ బిటుమెన్‌కు బదులుగా రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే బయో-బైండర్‌గా మార్చడానికి వినియోగిస్తారని తెలిపింది.





