
సుదీర్ఘకాలంగా ఇండో-కెనడియన్లు ఎదురుచూస్తున్న ‘కాంబాటింగ్ హేట్ యాక్ట్’ (బిల్లు సీ-9)కు కెనడా పార్లమెంట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ కీలక చట్టానికి హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర వేయగా, అనంతరం సెనెట్‌కు వెళ్లింది. ఈ చట్టం అమలుతో ప్రార్థనా స్థలాలపై దాడులు, ఉగ్రవాదాన్ని బహిరంగంగా కీర్తించడం వంటి వేర్పాటు వాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా కెనడా ప్రభుత్వం ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఉగ్రవాద చర్యలపై ఉక్కుపాదం..
ఈ చట్టం ప్రకారం.. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ర్యాలీలు తీసినా, వారి జెండాలు లేదా చిహ్నాలు ప్రదర్శించినా ఇకపై నేరంగా పరిగణిస్తారు. హిందూ దేవాలయాలు, గురుద్వారాలు, విద్యా సంస్థలపై దాడులు చేయడం లేదా భక్తులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు విస్తృత అధికారాలు కల్పించారు.
భారతీయులు ఎదురు చూస్తున్న బిల్లు!
కాగా, సుదీర్ఘకాలంగా కెనడాలోని భారతీయులు ఎదురు చూస్తున్న బిల్లుకు ఎట్టకేలకు కెనడా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఖలిస్థానీల ఆగడాలకు ఈ చట్టంతో చెక్ పడుతుందని నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. ఈ చట్టం ఇండో-కెనడియన్లకు, మైనారిటీ వర్గాలకు భద్రతపై భరోసా కల్పించింది. స్థానిక పోలీసులు ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తే, అది కేవలం దేశీయ శాంతిభద్రతలనే కాకుండా భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాలను కూడా స్థిరీకరిస్తుందని దౌత్య వర్గాలు ఆశిస్తున్నాయి.





