
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అనుచరులు రెచ్చిపోయారు. తాజాగా ఒక రెస్టారెంట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి తెగబడటం సంచలనం సృష్టిస్తోంది. గ్యాంగ్‌స్టర్‌గా పేరుగాంచిన, దివంగత మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ పేరు ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి మారుమోగుతోంది. ప్రస్తుతం థియేటర్లలో రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ‘ధురంధర్ 2’ సినిమాలో అతిక్ అహ్మద్‌ను పోలిన పాత్ర ఉండటం, అతనికి పాకిస్తాన్ ఐఎస్‌ఐ (ISI) తో ఉన్న సంబంధాలను చూపించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే, కేవలం సినిమాల్లోనే కాకుండా, బయట కూడా అతని అనుచరులు తమ ‘టెర్రర్’ ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్నారని తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
పాత కక్షల నేపథ్యంలో దాడి!
మార్చి 17వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో ఖుల్దాబాద్‌లోని అటాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల ప్రాపర్టీ డీలర్ ముజమ్మిల్ తన మామ మహమ్మద్ జాసిమ్‌తో కలిసి ఒక కబాబ్ సెంటర్‌కు వెళ్లారు. ఆ సమయంలో నవాబ్‌గంజ్‌కు చెందిన మహమ్మద్ సాకిబ్ తన 10-12 మంది అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ముజమ్మిల్‌ను చూడగానే పాత కక్షల నేపథ్యంలో సాకిబ్ బృందం ఒక్కసారిగా విరుచుకుపడింది. అతడిని తీవ్రంగా కొట్టి, రక్తమోడుతున్న స్థితిలో వదిలేసి పరారయ్యారని జాతీయ మీడియా సమాచారం. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
బాధితుడి ఫిర్యాదు మేరకు ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు (FIR No. 25/2026) నమోదైనట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. భూ వివాదాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రస్తుతం నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం అటాలా ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని యూపీ పోలీసులు వెల్లడించారు. కాగా, సంచలనం సృష్టిస్తున్న ‘ధురంధర్ 2’ సినిమాలో మాఫియా లింకులపై చర్చ జరుగుతున్న సమయంలోనే, వాస్తవ ప్రపంచంలో అతిక్ అనుచరులు ఇలా బహిరంగంగా దాడికి తెగబడటం స్థానికంగా కలకలం రేపుతోంది.





