
ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానున్న చార్‌ధామ్ యాత్రలకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు బద్రీనాథ్ – కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) ఆమోదం తెలిపింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ సహా కమిటీ పరిధిలోని 45 ఆలయాల్లో సనాతన ధర్మాన్ని అనుసరించని వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించారు. ఒకవేళ దర్శనం కోరుకునే భక్తులు ఎవరైనా ఉంటే తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆలయ ఆవరణలో ఈ అఫిడవిట్లు అందుబాటులో ఉంటాయి. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్లు బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది వెల్లడించారు. ‘‘సారా అలిఖాన్ వంటి సెలబ్రిటీ (బాలీవుడ్ నటి) కేదార్‌నాథ్‌కు వచ్చి అఫిడవిట్ సమర్పిస్తే, ఆమె దర్శనానికి ఎటువంటి ఆటంకం ఉండదు’’ అని స్పష్టం చేశారు. గతంలో ‘కేదార్‌నాథ్’ చిత్రంలో నటించిన సారా అలిఖాన్ ఇప్పటికే పలుమార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
చార్‌ధామ్ యాత్రికుల సౌకర్యాలు, భద్రత కోసం ఈ ఏడాది రూ.121 కోట్ల బడ్జెటును కేటాయించారు. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోనుండగా.. 22న కేదార్‌నాథ్, 23న బద్రీనాథ్ ఆలయాలను తెరుస్తారు. ఆలయాల ఆవరణలో యూట్యూబర్లు, బ్లాగర్లపై ఆంక్షలు ఉంటాయని బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు. మొబైల్ ఫోన్లు, కెమెరాల వంటివి డిపాజిట్ చేసేందుకు ఆలయాల ఆవరణల్లో సామాన్ల గదులు ఉంటాయన్నారు. గర్భగుడుల్లోకి ఫోన్లతో ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. పురోహితుల ప్రయోజనాల పరిరక్షణకు ‘తీర్థ పురోహిత్ సంక్షేమనిధి’ని ఏర్పాటుచేయాలన్న తీర్మానాన్ని సైతం ఆమోదించినట్లు వివరించారు.





