News

భక్తులకు మెరుగైన వసతులు

110views

భ్రమరాంబ, మల్లన్న దర్శనానికి శ్రీశైలానికి తరలివస్తున్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోన సమీక్షా సమావేశ మందిరంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా దేవస్థాన ఈఓ మాట్లాడుతూ.. ఉగాది మహోత్సవాల్లో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. 16వ తేదీ వరకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తున్నామన్నారు. క్యూ కాంప్లెక్స్‌, ఆలయ విభాగాలు పరస్పరం సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా విడతల వారీగా దర్శనాలను కల్పించాలన్నారు. క్యూకాంప్లెక్స్‌లో, క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందించాలని ఆదేశించారు.

సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటు విధులు నిర్వర్తించాలని అన్నారు. క్యూలైన్ల నిర్వహణలో పోలీసు శాఖ సహకారాలు పొందాలన్నారు. అటవీమార్గంలో కాలినడక వచ్చే భక్తులకు అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అంతరాయం లేకుండా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.