News

ఆలయాల నిర్మాణానికి టిటిడి నిధులు

165views

ప్రజల్లో ఆధ్యాత్మికత.. భక్తిభావాన్ని పెంపొందించేందుకు గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ముందుకొచ్చింది. శ్రీవాణి భజన మండప పథకం కింద దేవాలయాలు నిర్మించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారుల కాలనీల్లో నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. స్థలం కేటాయిస్తే చాలు ఆలయ నిర్మాణానికి అవసరమైన ఆర్థికసాయం అందించనుంది. స్థల విస్తీర్ణానికి అనుగుణంగా శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కేటాయించనున్నారు.

68 దరఖాస్తులు.. భజన మండప పథకం కింద జిల్లావ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి దేవాదాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి 85 దరఖాస్తులందాయి.

ఒకే నమునాలో.. కొత్త ఆలయాలన్నింటిని ఒకే నమునాలో నిర్మించనున్నారు. కేటాయించిన స్థలంలో గర్భాలయం, విమాన గోపురం, మండప నిర్మాణం చేపడతారు. గర్భగుడిలో మూలవిరాట్‌ ఏర్పాటు, ప్రహరీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన నిధులు మరో విడతలో అందించనున్నారు. గ్రామంలో ఆలయ నిర్మాణానికి స్థలం అందుబాటులో ఉన్నట్లు రెవెన్యూ అధికారి ధ్రువీకరించిన పత్రం అందజేయాలి. నూతన ఆలయానికి ఏర్పాటుచేసుకున్న కమిటీ తీర్మానం అవసరం ఉంటుంది.

  • ఆలయం నిర్మించే స్థలాన్ని ఏఈలతో పాటు దేవాదాయశాఖ అధికారి పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తారు.
  • మంజూరు ఇలా.. ఆలయ నిర్మాణానికి స్థల సేకరణకు తగ్గట్లుగా నిధులు మంజూరు చేస్తారు. ఐదు నుంచి 7 సెంట్లు ఉంటే రూ.10 లక్షలు, 7 నుంచి 10 సెంట్లు ఉంటే రూ.15 లక్షలు, 10కి పైగా సెంట్లు ఉంటే రూ.20 లక్షలు ఇస్తారు.
  • నూతన ఆలయాల నిర్మాణాలకు స్థలం ఇచ్చేందుకు దాతలు ముందుకురావాలని దేవాదాయశాఖ అధికారులు కోరారు. దరఖాస్తులపై క్షేత్ర పరిశీలన పూర్తిచేసి ప్రతిపాదనలు ఉన్నతస్థాయికి పంపిస్తున్నట్లు వివరించారు.